ఉపాధి కోల్పోయిన 160 కోట్ల మంది కార్మికులు
వారంతా అసంఘటితరంగ కార్మికులే
కటిక దారిద్య్రంలోకి మరో 10 కోట్ల మంది
ఐఎల్ఓ, ప్రపంచబ్యాంకు తాజా నివేదికల హెచ్చరిక
జెనీవా: కరోనా వైరస్ మనిషి ప్రాణాలనేకాదు…ఉద్యోగాలను కూడా లాగేసుకుంటోంది. మూడునాలుగు వారాల క్రితమే లాక్డౌన్ కారణంగా 19.5 కోట్ల ఉద్యోగాలుపోయే ప్రమాదం ఉందని ప్రకటించిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజాగా ఆ సంఖ్యను భారీగా పెంచిం ది. కరోనా వైరస్‌ను అదుపుచేసే ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా విధించిన లాక్డౌన్, ఇతర ఆంక్షల కారణంగా ఏకంగా 160 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం వుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఐఎల్ఓ అంచనా వేసింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 30.5 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని, లాక్డౌన్ పెరగడం కారణంగా ఈ సంఖ్య పెరిగిందని ఐఎల్ఓ అంచ నా వేసింది. ఉపాధి కోల్పోయే కార్మికుల్లో అత్యధికులు అసంఘటిత రంగ కార్మికులేనని పేర్కొంది. “ఐఎల్ఓ మోనిటర్ థర్డ్ ఎడిషన్ ః కొవిడ్ 19 అండ్ ది వరల్డ్ ఆఫ్ వర్క్” అనే నివేదికను ఐఎల్ఓ తాజాగా విడుదల చేసింది. విచిత్రమేమిటంటే, పనిగంటలు తగ్గిపోవడం కూడా ఉపాధి కోల్పోవడానికి ఒక కారణంగా మారింది. 160 కోట్ల మంది ప్రజల జీవనోపాధి కనీవినీ ఎరుగనిరీతిలో ప్రమాదంలో పడబోతున్నదని ఐఎల్ఓ హెచ్చరించింది. 2019 నాల్గవ త్రైమాసికాన్ని పోల్చిచూస్తే, ఈసారి 10.5 శాతం ఉపాధి స్థాయి క్షీణిస్తుందని అభిప్రాయపడింది. అంటే ఈ శాతం 30.5 కోట్లమందికి సమానం. వీరంతా వారానికి 48 గంటల పనిదినాల్లో ఉండే ఫుల్‌టైమ్ ఉద్యోగులు లేదా కార్మికులు. ఇప్పుడు వీరంతా రోడ్డునపడినట్లే. రెండవ త్రైమాసికంలో అమెరికాలో 12.4, ఐరోపా, మధ్య ఆసియా దేశాల్లో 11.8, మిగిలిన ప్రాంతాల్లో 9.5 శాతంపైగా కార్మికులు ఉపాధి కోల్పోతారు. అసంఘటిత కార్మికవర్గమే అత్యధికంగా దెబ్బతినబోతున్నదని ఐఎల్ఓ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 330 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు వుండగా, వారిలో 160 కోట్ల మంది కార్మికుల ఉపాధిపై ఇది ప్రభావం చూపనుందని, మరికొంత మంది సంఘటితరంగ ఉద్యోగులపై కూడా అనూహ్యమైన ప్రభావం పడనుందని ఐఎల్ఓ వివరించింది. కరోనా, లాక్డౌన్ల పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా అసంఘటితరంగ శ్రామికుల ఆదాయం 60 శాతం పడిపోయింది. అమెరికాలో వీరి ఆదాయం 81 శాతం, ఆసియా, పసిఫిక్ దేశాల్లో 21.6 శాతం, ఐరోపా, మధ్య ఆసియా దేశాల్లో అసంఘటితరంగ శ్రామికుల ఆదాయం 70 శాతం పడిపోయిందని ఐఎల్ఓ అంచనా వేసింది. కార్మికులు ఉపాధి కోల్పోవడం ఒక అంశమైతే, కార్మికులు పనిచేసే సంస్థలు, ప్రదేశాలను అనివార్య పరిస్థితుల్లో యాజమాన్యాలు మూసివేసే పరిస్థితి రావడం మరో అంశం. వివిధ వాణిజ్య, వ్యాపార సంస్థలతోపాటు భవన నిర్మాణ విభాగంలో పలు సంస్థలను మూసివేయనున్నారు. ఒక్క హోల్‌సేల్, రిటైల్ రంగంలోనే 23.2 కోట్ల మంది కార్మికులు రోడ్డున పడబోతున్నారని ఐఎల్ఓ ప్రకటించింది. ఇక ఉత్పాదక రంగంలో 11.1 కోట్ల మంది, హోటల్, ఆహార సేవల రంగంలో 5.1 కోట్ల మంది, రియల్ ఎస్టేట్‌లో 4.2 కోట్ల మంది ఉపాధి కోల్పోతున్నారని అంచనా వేసింది.