ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ఇకలేరు

ఉరి వేసుకున్నట్లు పోస్టుమార్టం వైద్యుల ప్రాథమిక అంచనా
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
కోడెల మరణంపై రకరకాల వదంతులు, ఆరోపణలు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌/ సిటీబ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీమంత్రి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ తాజా మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు మృతి నగరంలో తీవ్ర కలకలం రేపింది. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం భోజనం చేసిన అనంతరం తన గదిలోకి వెళ్లిన కోడెల.. ఎంతటికీ తలుపులు తీయకపోవడంతో ఆయన కూతురు, గన్‌మెన్‌ సహకారంతో తలుపులను బద్దలుకొట్టి చూడగా, ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను చికిత్స నిమిత్తం బసవతారకం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 12-:39 గంటలకు మృతి చెందినట్లు సిఇఒ ఆర్‌వి ప్రభాకర్‌రావు ప్రకటించారు. అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఆయన పార్థివదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరణవార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆసుపత్రుల వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బసవతారకం ఆసుపత్రికి వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఆయన మరణంపట్ల అభిమానులు, పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం అనంతరం ఎన్‌టిఆర్‌ భవన్‌కు తరలించారు. టిడిపి శ్రేణులు, అభిమానులు, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం నరసరావుపేటలో అత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, కోడెల మృతిపై రకరకాల వదంతులు, ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఆయన కుమార్తె విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, కోడెల భౌతికకాయానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. నలుగురు వైద్యబృందం పోస్టుమార్టం నిర్వహించింది. కోడెలది ఆత్మహత్యగా పోస్టుమార్టం నిర్వహించిన నలుగురు వైద్యబృందం ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ పోస్టుమార్టాన్ని పోలీసులు వీడియోలో చిత్రీకరించారు.
కోడెల సేవలు మరువలేనివి : నందమూరి బాలకృష్ణ
కోడెల శివప్రసాద్‌ ప్రజలకు ఎనలేని సేవలు చేశారని హిందూపురం ఎంఎల్‌ఎ, సినీ నటుడు నందమూరి బాలకృస్ణ అన్నారు. శారీరకంగా ఆయన లేకపోయినా మన మనసుల్లో ఆయన ఎప్పటికీ ఉంటారన్నారు. బసవతారకం ఆసుపత్రి నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి నిధులు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. 2000 వరకు బసవతారకం ఆసుపత్రికి చైర్మెన్‌గా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణవార్త విన్న వెంటనే సినిమా షూటింగ్‌ రద్దు చేసుకొని వచ్చినట్లు తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

DO YOU LIKE THIS ARTICLE?