రైతులు… నిశ్చింతగా ఉండాలి
దిగజారిన మాటలు నమ్మి మోసపోవద్దు
చివరి ఖాతా వరకూ రుణమాఫీ చేస్తాం
రైతు పేరు ఎత్తని వారికి ఆందోళన చేసే హక్కుందా?
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
ప్రజాపక్షం/ ఖమ్మం
రైతులు రుణమాఫీ విషయంలో ఎటువంటి ఆవేదనకు గురికావాల్సిన అవసరం లేదని రైతు గురించి అవగాహన, ఆలోచన లేని వారి మాటలు నమ్మి మోసపోవద్దని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులు నిశ్చితంగా ఉండవచ్చునని, చివరి ఖాతా వరకు రుణమాఫీ చేస్తామని వివిధ సాంకేతిక అంశాలతో ఆగిన రుణమాఫీని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. బుధవారం ఖమ్మంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ కొంత మంది అసత్యాలు పలికి ఓఆర్‌ఆర్‌ను తెగనమ్మినా రైతు రుణాలను మాఫీ చేయలేదని, ఈ విషయాన్ని కాగ్ నివేదికే బయట పెట్టిందన్నారు. 12 డిసెంబరు 2018 నుంచి 9 డిసెంబరు 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించామని, దీనిలో ఎటువంటి మార్పు కానీ, ఆంక్షలు కానీ లేవని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీ చేస్తుంటే సహకరించాల్సింది పోయి అనవసర గందర గోళానికి గురి చేస్తున్నారని బిఆర్‌ఎస్ హయాంలో రుణమాఫీలో దోపిడీ జరిగిందని అసలు బిజెపికి రుణమాఫీ ఊసే లేదని వీరు విమర్శిస్తే ప్రజలు పట్టించుకుంటారా అని తుమ్మల ప్రశ్నించారు. పొరపాట్లు ఉంటే సరి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినట్లుగా రెండు లక్షల లోపు రుణం ఉన్న కుటుంబాలను రుణ విముక్తులను చేస్తామని కొన్ని ఖాతాలకు సంబంధించి కుటుంబ సభ్యుల నిర్దారణ జరుగుతుందని రైతులు అధైర్య పడవద్దన్నారు. రాష్ట్రం మొత్తంగా 40 బ్యాంకుల నుంచి 5782 శాఖల ద్వారా 4178892 ఖాతాల ద్వారా రైతులు రుణాలు తీసుకున్నారని, రూ.31వేల కోట్ల పైచిలుకు రుణాలను రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కుటుంబ నిర్ధారణ జరగకుండా గత ప్రభుత్వం తప్పు చేసిందని ఈ ప్రభుత్వం అటువంటి తప్పు చేయదని తుమ్మల తెలిపారు. రుణమాఫీ తర్వాత పూర్తి వివరాలు ఇస్తామని బిజెపి, బిఆర్‌ఎస్ లు తొందరపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కేటిఆర్ లాంటి వారు జీవిత కాలంలో ఎన్నడూ రైతును తలవలేదని ఇప్పుడు ట్విట్టర్ల ద్వారా రైతు జపం చేస్తున్నారని అయినా నమ్మే పరిస్థితి లేదన్నారు. విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజా ప్రయోజనాలను కోరుకోవాలి తప్ప చిల్లర వేషాలు సరికాదన్నారు. కెటిఆర్ లేదా బిఆర్‌ఎస్ నేతలు స్థాయి మరిచి దిగజారుడు భాష ఉపయోగిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే భాషలో సమాధానం చెబుతున్నారని తుమ్మల తెలిపారు. సొంత ప్రయోజనాల కోసం దురాలోచన మంచిది కాదని ఇప్పుడు ఎన్నికలు కూడా లేవన్న వాస్తవాన్ని గ్రహిస్తే మంచిదని ఆయన తెలిపారు. రెండు లక్షల పైబడిన రుణాలకు సంబంధించి అతి త్వరలో కెబినెట్ నిర్ణయం తీసుకుని దశల వారీగా అమలు చేస్తామని ఆయన తెలిపారు. ధాన్యం కొనలేని వారు పౌర సరఫరాల శాఖను నష్టపరిచిన వారు మాకు నీతులు చెబుతుంటే వినడానికి సిద్దంగా లేమన్నారు. రుణమాఫీ ప్రక్రియ కష్టం, ఆర్థిక ఇబ్బందులతో కూడుకున్నదైనా ఎట్టి పరిస్థితుల్లోను రుణమాఫీని ఆపబోమని వరుస క్రమంలో ప్రతి ఖాతాలో రెండు లక్షలు జమ చేస్తామని ఆయన తెలిపారు. ఆదాయ పన్ను కడుతున్న వారికి మాత్రం రుణమాఫీ చేయమని స్పష్టం చేశారు. రెండు లక్షల లోపు రుణమాఫీతో 90 శాతం చిన్న, సన్నకారు రైతులు రుణ విముక్తులు అవుతున్నారని ఆయన తెలిపారు. రుణమాఫీ జరిగిన ప్రతి రైతుకు తిరిగి రుణం ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించామని రుణమాఫీ ద్వారా అయినా మొత్తం కంటే ఇంకా ఎక్కువ కూడా ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించామని తుమ్మల తెలిపారు.
ఆందోళనకు గురికావొద్దు
RELATED ARTICLES