వెంకటేశ్వర్ల సంతాప సభలో కొనియాడిన వక్తలు
ప్రజాపక్షం / హైదరాబాద్
అసలుసిసలైన కమ్యూనిస్టు సిపిఐ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి సిద్ది వెంకటేశ్వర్లు అని పలువురు నాయకులు పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బినగర్ కొత్తపేటలోని వైష్ణవి కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు సంతాప సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, పలువురు నాయకులు హాజరయ్యారు. తొలుత సిద్ది వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నారాయణ మాట్లాడుతూ సిద్ది మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు అని, ఆయన చేసిన సేవలు పార్టీ ప్రజలు ఎన్నడూ మరువలేరన్నారు. విద్యార్థి సంఘం నుంచి యువజన సమాఖ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా చేసి ఎన్నో పోరాటాలకు ముందుండి నడిపించిన చరిత్ర సిద్దిదని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జన సేవాదళ్‌గా వేల మంది సైనికులను తయారు చేసి శిక్షణ ఇచ్చి ఉద్యమాలకు ఊపిరి పోసిన చరిత్ర సిద్దిదని, ఖమ్మం జిల్లాతో పాటు రాష్ర్టంలో కరడుగట్టిన కమ్యూనిస్టుగా, నిబద్ధత చాటుకున్న నాయకుడు అని ప్రశంసించారు. ప్రస్తుత రాజకీయాల్లో ఉదయమో పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం మరొక పార్టీ మారి రాజకీయాలను మలినం చేస్తున్నారని, ఈ తతంగమంతా ప్రజలు గుర్తించి, రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీ బలంగా రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ది వెంకటేశ్వర్లు సతీమణి రిటైర్డ్ జడ్జి సరళ కుమారి సామాజిక ధృక్పథంతో న్యాయవ్యవస్థను ముందుకు నడిపించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని, ఆమె తనదైన శైలిలో పాత్ర వహించారని నారాయణ పేర్కొన్నారు. చాడ వెంకటరెడ్డి ప్రసంగిస్తూ తమ అనుబంధం గొప్పదని, తాను రాష్ర్ట కార్యదర్శిగా, సిద్ది రాష్ర్ట సహాయ కార్యదర్శిగా ప్రజాపోరాటాలకు ప్రజా సమస్యలపై నిరంతర ఉద్యమాలకు పిలుపునిచ్చామని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకే కాదు.. ప్రజలకు తీరని లోటు అని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు కంటి నిండా నిద్రలేకున్నా ప్రజాసేవకు అంకితమవుతారన్నారు. సిద్ది వెంకటేశ్వర్లు వరంగల్‌లోని సిపిఐ కార్యాలయం నిర్మాణంలో ప్రముఖమైన పాత్ర పోషించారని అన్నారు. సభలో సిపిఐ రాష్ర్ట సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి , కూనంనేని సాంబశివరావు, ప్రజాపక్షం ఎడిటర్ కె. శ్రీనివాస్‌రెడ్డి, సిపిఐ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, పశ్య పద్మ, సిపిఐ కార్య వర్గ సభ్యులు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి సభ్యులు అయోధ్య, పాలమాకుల జంగయ్య, ఆందోజు రవీంద్ర చారి, బిసి హక్కుల సాధన సమితి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాయ బండి పాండురంగచారి, కెవిఎల్, మారగోని ప్రవీణ్ కుమార్, పానుగంటి పర్వతాలు, తాటి వెంకటేశ్వర్లు, ఓరుగంటి యాదయ్య, బాతరాజు నర్సింహ, శేఖర్‌రెడ్డి, పూజారి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సిద్ది వెంకటేశ్వర్లు సతీమణి రిటైర్డ్ జడ్జి సరళ కుమారి, వారి కుమారులు భరత్ కుమార్, భరత్ కుమార్ కుటుంబ సభ్యులు, సిపిఐ కార్యకర్తలు హాజరయ్యారు
అసలుసిసలైన కమ్యూనిస్టు సిద్ది
RELATED ARTICLES