హామీల అమలుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది
ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా పథకాలు ఆపం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభం
ప్రజాపక్షం/హైదరాబాద్ ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలపై సోనియాగాంధీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటామన్నారు. ఆర్ధిక నియంత్రణను పాటిస్తూ, పేదలకు ఇబ్బంది కలగకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నదన్నారు. తండ్రీ కొడుకులు, మామ అల్లుడు ఇది జరగకపోతే బాగుండు, అది ఇవ్వకపోతే బాగుండు అనే ఆలోచనతో ఎన్నో రకాల ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తున్నారని, వారిని ప్రజలు విశ్వసించడం లేదని కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘ఆరు గ్యారంటీ’లలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద రూ.500లతో ‘సబ్సిడీ వంట గ్యాస్’ సిలిండర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,మంత్రులతో కలిసి హైదరాబాద్‌లోని డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా లబ్ధిదారులకు ఉచిత జిరో విద్యుత్ బిల్లును, గ్యాస్ బిల్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు,పొన్నం ప్రభాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌చిన్నారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఎంఎల్‌ఎలు హాజరయ్యారు. అంతకుముందు సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరెన్ని మాట్లాడినా, పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదని, ఏది ఏమైనా తమ హామీలను అమలు చేస్తామన్నారు. సోనియాగాంధీ మాట ఇస్తే, మాట తప్పరని, మడప తిప్పని నాయకురాలని, ఆమె మాట తమకు శిలాశాసనమని, దీనిని సువర్ణ అక్షరాలతో లిఖించినట్టుగానే అమలు చేస్తామని సిఎం స్పష్టం చేశారు. సోనియా మాట నిలబెట్టి, ఆమె గౌరవాన్ని పెంచేలా చేస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ‘తెలంగాణ ఒక మాడల్’గా గొప్పగా చెప్పుకునేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని అన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, తాజాగా మరో రెండు పథకాలు ప్రారంభించుకున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మిగతా హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. చేవెళ్లలో లక్ష మంది మహిళల సమక్షంలో పథకాన్ని ప్రారంభించాలని భావించామని, కానీ ఎంఎల్‌సి ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయంలో పథకాలను లాంఛనంగా ప్రారంభించామని సిఎం రేవంత్ రెడ్డి వివరించారు. కట్టెల పొయ్యి నుంచి మహిళలకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే నాటి యుపిఎ ప్రభుత్వం రూ.1500కే దేశంలోని పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లను అందజేసిందని, రూ.400 గ్యాస్ సిలిండర్‌ను సరఫరా చేసిందని గుర్తు చేశారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాగానే గ్యాస్‌ను రూ.12 వందలకు పెంచిందని విమర్శించారు. పేదలకు గ్యాస్ సిలిండర్ భారాన్ని తగ్గించాలని రూ.500కే సిలిండర్ ఇస్తున్నామన్నారు.పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొన్నేళ్లుగా దేశంలో గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగిందని, పెరిగిన ధరల నుండి మహిళలకు ఊరట కల్పించాలని భావించి, రూ.500ల కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించామని వివరించారు. ఈ పథకం ద్వారా 40 లక్షల కుటుంబాలకు లబ్ధి పొందనున్నారన్నారు. లోపాలను గుర్తించి పథకంలో మార్పులు చేసుకుంటూ వెళ్తామని, త్వరలో నేరుగా లబ్ధిదారులకు రూ.500ల కే సిలిండర్ పొందేలా ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు.అటవీశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
మార్చి నెలలో 200 యూనిట్లకు జీరో బిల్లు : భట్టి
భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన అందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తామని, వచ్చే మార్చి నెలలో రెండు వందల యూనిట్లకు గాను జీరో బిల్ ఇస్తామని, ఎవ్వరూ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అర్హత కలిగి, ఇప్పటి వరకు ఎవరైనా దరఖాస్తు చేయలేని వారు మళ్లీ మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రూ. 500లకే గ్యాసు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ సరఫరా అమలు దేశానికి దశ దిశ నిర్ధేశం చేయనుందన్నారు. విప్లవాత్మకంగా చేసిన ఆలోచన నిర్ణయాల్లో భాగమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తారా?, లేదా అని దేశం, రాష్ట్రం ఎదురు చూస్తోందన్నారు. అమలుకు సాధ్యం కాని ఆరు గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుండే బిఆర్‌ఎస్ అసత్య ప్రచారం చేసిందని విమర్శించారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లిందని విమర్శించారు. బ్యాంకుల నుండి ఓ.డి లు తెచ్చి, జీతాలు ఇచ్చే దుస్థితికి తీసుకొచ్చారన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేయడంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ఆరు గ్యారంటీల అమలుకు సిఎం రేవంత్ రెడ్డి నుండి ఎంఎల్‌ఎల వరకు ప్రతి రోజూ కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఒక వైపు నిధులను సమీకరించుకుంటూ,మరో వైపు దుబారా ఖర్చులను పూర్తిగా తగ్గించి, నెలలోనే మొదటి వారంలో ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే స్థితికి తీసుకొచ్చామన్నారు. వినియోగదారులకు నేరుగా ప్రభుత్వం నుండి గ్యారంటీల లబ్ధి అందకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో కూడా ప్రణాళిక చేసుకుని రెండు గ్యారంటీల అమలు కార్యాక్రమానికి నాంధి పలికామని వివరించారు. ఆసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే ఇందిరమ్మ రాజ్య సంకల్పం, లక్ష్యం అని అన్నారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు, అప్పులు ఎన్ని ఉన్నప్పటికీ ఎన్ని ఒడిదుడుకులున్నప్పటికీ ఆరు గ్యారెంటీల హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. 200 యూనిట్ల వరకు అందించే ‘ఉచిత గృహ విద్యుత్’విషయంలో అనేక కోతలు ఆంక్షలన విధిస్తారని బిఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచారం చేసిందన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తామన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని దశా దిశా నిర్దేశం చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్నికల ప్రచార సభలో గ్యారంటీలు ప్రకటించిన సోనియా గాంధీ,ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అష్టకష్టాలున్నా… ఆరు ‘గ్యారంటీ’లు
RELATED ARTICLES