అర్ధరాత్రి ఆపద..

ఎంతకూ కలవని ‘104’
అనారోగ్యానికి గురైనా అందని వైద్యం
రాత్రంతా ఆస్పత్రుల చుట్టు ప్రదక్షిణలు
పలుకుబడి ఉంటేనే ‘వైద్య సహాయ’క చర్యలు
ఆలస్యంతోనే వీడుతున్న ప్రాణాలు
ప్రజాపక్షం/హైదరాబాద్‌ కరోనా మహమ్మారి చిన్నపాటి రోగాలనే కాదు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి కూడా సరైన సమయానికి వైద్యం అందకపోవడంతో ప్రాణాల మీదకు తెస్తుంది. మహమ్మారి విజృంచడంతో గతం నుండే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆస్పత్రిలో చేర్చుకునేందుకు ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రులు ససేమీరా అంటున్నాయి. ఇక అర్ధరాత్రి ఆపదొస్తే రోగుల ప్రాణం ‘గాలిలో దీపం’గా మారుతోంది. కనీసం వారికి అంబులెన్స్‌ సౌకర్యం కూడా దొరకని దుస్థితి ఏర్పడింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులను ఆశ్రయించినప్పటికీ అక్కడి సిబ్బంది చేతులేత్తేస్తున్నా రు. ఇటీవల ఒక గర్భిణి చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టు చక్కెర్లు కొట్టింది. అలాగే మరో ప్రభుత్వ ఉద్యోగి భార్య అనారోగ్యానికి గురి కాగా, ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోలేదు. కాగా ఛాతి ఆస్పత్రిలో మరణించిన రవికుమార్‌ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన అనారోగ్యానికి గురయితే ప్రైవే టు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఎవ్వరూ చేర్చుకోలేదు. తాజాగా ఘట్‌కేసర్‌కు చెందిన ఒక సీనియర్‌ జర్నలిస్టుకు మధుమేహం బాగా పెరిగింది. పైగా ‘పాంక్రియాటైటిస్‌’తో తీవ్ర అనారోగ్యానికి గురవ్వగా స్థానికంగా ఉన్న ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తే వారు చేతులేత్తేశారు. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడి నుండే నిమ్స్‌ ఆస్పత్రికి ఫోన్‌లో సంప్రదించగా తాము చేర్చుకోలేమనే సమాధానం వచ్చింది. దీంతో ఉప్పల్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడా నిరాకరించారు. అక్కడి నుండి మలక్‌పేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. పైగా తమ వద్ద ఉన్న ‘ఐసియులో కొవిడ్‌ ఉన్నారని సదరు ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు సమాధానమిచ్చారు. చివరకు తెల్లవారు జామున హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చుకున్నారు.
పలుకుబడి ఉంటేనే వైద్యం
కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎవరిదైనా పలుకుబడి ఉంటేనే దీర్ఘకాలిక రోగులను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిపిస్తున్నాయి. కరోనా వైరస్‌కు ముందు సీరియస్‌గా ఉన్న రోగులను కూడా ఇబ్బడిముబ్బడిగా చేర్పించుకున్న ప్రైవేటు ఆస్పత్రులు ప్రస్తుతం పట్టించుకోవడం లేదని రోగుల కుటుంబ సభ్యులు విమర్శిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వ ఆస్పత్రులకైనా వెళ్దామంటే అక్కడా ఇదే పరిస్థితి నెలకొన్నది. హైదరాబాద్‌లో పెద్ద ఆస్పత్రులైన గాంధీ ప్రస్తుతం పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మారింది. మిగిలిన నిమ్స్‌, ఛాతి, ఫీవర్‌ ఆస్పత్రిలో కూడా రోగులను చేర్చుకోవడం పెద్ద ప్రహసనంగా మారింది. ప్రజాప్రతినిధుల అండతో అక్కడి వైద్యులకు చెప్పిస్తే తప్ప అడ్మిషన్‌ దొరికే పరిస్థితి లేదని కొందరు వాపోతున్నారు. కాగా మరి కొన్ని సందర్భాల్లో కొందరు వైద్య సిబ్బంది మాత్రం సీరియస్‌గా ఉంటేనే చేర్చుకుంటామని చెబితే, ఇంకొందరు మాత్రం ఉదయం వస్తే చేర్చుకుంటామని పేషంట్లను తిరిగి ఇంటికి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో సరైన సమయలో వైద్యం అందక కొందరు ప్రాణాలు వదిలిన వారూ లేకపోలేదు.
కలువని ‘104’ ‘104’ డయల్‌ చేస్తే తగిన సహాయం అందజేస్తామని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ కొన్ని సమయంలో ఈ నంబర్‌ కూడా కలువడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులకు దాదాపు వైద్య సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో అందరూ ‘104’నే ఆశ్రయించే పరిస్థితి నెలకొన్నది. కొందరికి నంబర్‌ కలువగా మరి కొందరికి ‘104’ కలువడం లేదు. అయితే కొందరు స్థానిక పోలీసుల సహకారంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. కానీ చాలా మందికి కనీసం అంబులెన్స్‌సేవలు, ఆపదలో ఉన్న వారికి ప్రాథమిక చికిత్స కూడా అందడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సమయానికి చికిత్స అందితే కనీసం ప్రాణం నిలిచే పరిస్థితి ఉంటుందని, గంటల తరబడి ఆస్పత్రుల చుట్టు తిరిగే సరికే సమయం చేయి దాటిపోతుందని, అప్పటికే రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు వదులుతున్నారని పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి.
అసలే ఇబ్బందులు.. పైగా అందని సాయం
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో కేవలం భార్య,భర్త మాత్రమే ఉండి, వారిలో ఒకరు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వారి పరిస్థితులు వర్ణనాతీతంగా మారాయి. కరోనాకు ముందు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వారు అర్ధరాత్రి ఏదైనా ఆపదొస్తే ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరితే వారికి తక్షణమే చికిత్స అందించేవారు. ఇందులో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు బీమా సౌకర్యం కలిగినవారు ఉండగా, మరి కొందరు తమ వద్ద ఉన్న కొంత డబ్బును అప్పటికప్పుడు చెల్లించి, ఆ తర్వాత ‘ముఖ్యమంత్రి సహాయ నిధి’ ద్వారా వైద్య సౌకర్యాన్ని పొందే వెసులుబాటు ఉండేది. కానీ ప్రస్తుతం ఆ వెసులుబాటు, సౌకర్యం కనిపించడం లేదు. పైగా అత్యవసర కేసులకు ప్రైవేటు ఆస్పత్రులు చికిత్స అందిచకపోగా తమ వద్ద ‘కరోనా’ కేసులు ఎక్కువగా ఉన్నాయని, ‘మీరే’ ఇబ్బంది పడుతారంటూ పేషంట్‌కు చెందిన కటుంబ సభ్యులను, స్నేహితులను భయపెట్టిస్తున్నారు. దీంతో వారు ఎక్కడికి తీసుకెళ్లాలో అంతుపట్టక బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెల్లదీస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?