HomeNewsBreaking Newsఅమెరికాలో నిరసన జ్వాలలు

అమెరికాలో నిరసన జ్వాలలు

న్యూయార్క్‌ : అమెరికాలో జాత్యహంకారంపై వెల్లువెత్తిన నిరసనలు ఊపందుకున్నాయి. నల్ల జాతీయుడు “జార్జ్‌ ఫ్లాయిడ్‌” మరణంతో అమెరికా అట్టుడుకుతోం ది. దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు భగ్గుమంటున్నాయి. జార్జ్‌కు న్యాయం జరగాలంటూ నిరసనకారులు ఉద్యమిస్తున్నారు. జార్జ్‌ మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. కార్లు, బిజినెస్‌ కేంద్రాలను నిరసనకారులు తగలబెడుతున్నారు. పోలీసులు కూడా ఉద్యమకారులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ లాఠీఛార్జీలకు పాల్పడుతున్నారు. ఉన్నట్టుండి అమెరికన్‌ పోలీసుల దౌర్జన్యాలు మరింత పెరిగాయి. అయినప్పటికి ఉద్యమకారులు వెనకడుగువేయటంలేదు. పోలీసుల తుపాకులకు సైతం భయపడకుండా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం పోలీసులు, నిరసనకారులు ఎదురుపడ్డప్పుడు తీసిన పలు చిత్రాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యం గా డాయ్‌ సుగానో అనే ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఆఫ్రికన్‌ అమెరికన్‌ నర్స్‌ పోలీసుల ముందు మోకాళ్లపై నిల్చుని శాంతియుతంగా లొంగిపోతున్న చిత్రమది. ఈ ఫొటో కారణంగా సదరు నర్సు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయిపోయింది. నెటిజన్లు కూడా ఆమె వ్యవహరించిన తీరు ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అమెరికాలో ఓ పోలీసు కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు నిరసనగా పలు నగరాల్లో శుక్రవారం నుంచి ఆందోళనలు చెలరేగాయి. తొలుత శాంతియుతంగానే ప్రారంభమైన ఆందోళనలు అనతికాలంలోనే హింసాత్మకంగా మారాయి. జస్టిస్‌ ఫర్‌ ఫ్లాయిడ్‌ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. అనేక చోట్ల పోలీసుల వాహనాలు, అధికారిక భవనాలపై రాళ్లు రువ్వా రు. మరికొన్ని చోట్ల వాహనాలు, రెస్టారెంట్లకు నిప్పంటించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసలు నిరసనల్ని అదుపు చేయడానికి బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. కొన్నిచోట్ల ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఎట్టకేలకు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పెంటగాన్‌ పరిస్థితి చేదాటకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అవసరమైతే మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ఓ సంబంధిత అధికారి తెలిపారు. జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడపై పోలీసు ఒకరు మోకాలితో తొక్కిపెట్టడంతో ఊపిరాడక గిజగిజలాడిపోయి చివరకు మరణించాడన్నది ఆరోపణ. దయచేసి నా గొంతుపై కాలు తీయండి.. ఊపిరి ఆడట్లేదు. ప్రాణం పోయేలా ఉంది. నన్ను చంపేసేలా ఉన్నారు అని విలవిలలాడిపోయినా ఆ కర్కశ పోలీసు కనికరించలేదు. అమెరికాలోని మినియాపొలిస్‌లో సోమవారం రాత్రి ఈ దుర్మార్గం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన రోజు రాత్రే ఆందోళనలు ఊపందుకున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు మినియాపొలిస్‌ వీధుల్లోకి వచ్చి ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మిగిలిన నగరాలకు ఇవి విస్తరించాయి. శ్వేత సౌధం ఎదుట ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీనికి తోడు అందోళనకారులను దుండగులుగా అభివర్ణిస్తూ ట్రంప్‌ చేసిన ట్వీట్‌ అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. దోపిడీలు మొదలైతే కాల్పులు మొదలవుతాయని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. మరోపక్క ఈ ఆందోళనలు న్యూయార్క్‌ నగరానికి కూడా పాకాయి. అసలే కరోనావైరస్‌ విజృంభించిన ఈ పట్టణంలో వేలమంది ఆందోళనలు నిర్వహించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఫ్లాయిడ్‌ వీడియో బయటకు రాగానే అమెరికన్లకు ఒక్కసారిగా ఎరిక్‌ గార్నర్‌ ఘటన మదిలో మెదిలింది. దీనికి తోడు అధికారులకు సహకరించిన నిరాయుధుడిని చంపినట్లు తేలడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకొంది. మరోమారు శ్వేతజాతి అహంకారపూరిత వైఖరిపై ఐ కాంట్‌ బ్రీత్‌ ఉద్యమం ఊపిరిపోసుకొంది. ఈ ఉద్యమానికి అమెరికాలోని చాలా మంది శ్వేతజాతీయుల మద్దతు ఉండటం విశేషం. ఈ ఘటనకు కారణమైన నలుగురు అధికారులను తొలగించారు. కానీ, ఉద్యమం ఏమాత్రం ఆగలేదు. ప్రస్తుతం 16 రాష్ట్రాల్లోని 25 పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. బీవర్లీ హిల్స్‌, లాస్‌ ఏంజెల్స్‌, డెన్వెర్‌, మియామి, అట్లాంట, షికాగో, లూసివిల్లే, మినియాపొలిస్‌, సెయింట్‌ పౌల్‌, రెచెస్టర్‌, సిన్సినాటి, క్లీవెలాండ్‌, కొలంబస్‌, డేటన్‌, టోలెడో, యూజీన్‌, పోర్ట్‌ ల్యాండ్‌, ఫిలడెల్ఫియా, పిట్స్‌ బర్గ్‌, చార్లెస్టన్‌, కొలంబియా, నష్విల్లె, ఉటా,సాల్ట్‌ లేక్‌ సిటీ, సియాటెల్‌, మిల్వాంకి నగరాలు కర్ఫ్యూ నీడలో ఉన్నాయి. కాగా, ఇప్పటికే అమెరికా నేషనల్‌ గార్డ్‌ రంగంలోకి దిగారు. వీరికి సహాయంగా మరో 10,800 మందిని కూడా మినియాపొలిస్‌, సెయింట్‌ పౌల్‌కు తరలిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోపక్క పెంటగాన్‌ కూడా అప్రమత్తమై భద్రతా బలగాలు సిద్ధంగా ఉండాలని పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments