ఆచరణకు నోచుకోని మంత్రుల హామీలు
ప్రయాణంలో నరకయాతన అనుభవిస్తున్న వాజేడు ప్రజలు
ప్రజాపక్షం / వాజేడు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండ లం అభివృద్ధికి ఆమడ దూరంలో కొట్టు మిట్టాడుతున్నది. మం త్రులు ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోకపోవడంతో మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నేటికీ కలగానే మిగిలింది. ప్రతి ఏటా డబుల్ రోడ్డు నిర్మించి తీరుతామని అధికార పార్టీ నేతలు ప్రగల్బాలు పలుకుతూ విస్మరిస్తున్నారని, వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి రావాలంటే గుంతల దారుల్లో ప్రయాణం చేస్తూ నరక యాతన అనుభవిస్తున్నామని సుమారు 60 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాజేడు గుమ్మడిదొడ్డి గ్రామాల మద్య ఉన్న రహదారి గుండా నిత్యం సుమారు 20 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారని, ఈ రోడ్డు ఏటా వర్షాకాలంలో ముంపునకు గురౌతు పూర్తిగా ధ్వంసం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో దారిపై నిలిచిన నీటితో గుంతలు ఎక్కువై పలుమార్లు వాహనదారులు ప్రమాదాలకు గురికావడంతో పాటు అనారోగ్యం పాలవుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మండల కేంద్రానికి జగన్నాధపురం మీదుగా చాలా దూరం ప్రయాణించి మండల కేంద్రానికి చేరుకునే లోపు అధికారులు ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి ఏర్పడిందని స్దానికులు అంటున్నారు. మరోవైపు ఏడ్జర్లపల్లి నుండి వాజేడు మండల కేంద్రానికి ఉన్న ప్రధాన రహదారి పరిస్థితి కూడా మరీ దారుణంగా తయారైంది. ఏడ్జర్లపల్లి నుండి గుమ్మడిదొడ్డి వరకు రూ.50 కోట్లతో డబుల్ రోడ్డు మంజూరు చేస్తామని, రహదారి నిర్మాణం 3 నెలల్లో ప్రరంభిస్తామని మండల సర్వసభ్య సమావేశంలో అప్పటి ఎంఎల్‌సి బాలసాని లక్ష్మినారాయణ హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అది నేటికీ హామీగానే మిగిలింది. దీంతో ఏడ్జర్లపల్లి, కొత్తూరు, ముత్తారం, పూసూరు, మండపాక గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావడానికి చేసే ప్రయాణం వర్ణణాతీతంగా మారింది. ఇదిలా ఉండగా వాజేడు, జగన్నాధపురం గ్రామాల మధ్య నాలుగు కిలోమీటర్ల బిటి రోడ్డు నిర్మాణంలో సంబంధిత కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా కాంట్రాక్టర్ ఆడిందే ఆట, పాడిందే పాటగా మారి నిర్మించిన కొద్ది నెలలకే రోడ్డు చాలా వరకు దెబ్బతిని మూడు నాళ్ల ముచ్చటగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ బదిలీతో సన్నగిల్లిన ఆశలు
గతంలో ములుగు జిల్లా కలెక్టర్‌గా వున్న ఆకునూరి మురళి వాజేడు మండలంలో పర్యటించి వాజేడు మండల కేంద్రానికి రహదారి సమస్యపై సర్వే జరిపి నివేధికను అందించాలని రోడ్డు, భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. అయితే ఐఎఎస్‌ల బదిలీలలో భాగంగా కలెక్టర్ మురళి బదిలీపై వెళ్లడంతో డబుల్ రోడ్డుపై ప్రజల ఆశలు సన్నగిల్లాయి. తర్వాత వచ్చిన కలెక్టర్‌లు ఏ ఒక్కరు వాజేడు మండల కేంద్రానికి డబుల్ రోడ్డు విషయంపై నోరు మెదపకపోవడంతో నేటికీ గుంతల రోడ్లపైనే ప్రయాణం సాగించక తప్పడం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
అభివృద్ధికి ఆమడ దూరం
RELATED ARTICLES