షార్జా: షార్జా వేదికగా జరుగుతున్న టి10లీగ్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. శనివారం ఇక్కడ నార్థర్న్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పక్తూన్స్ కెప్టెన్ అఫ్రిది పరుగుల సునామీ సృష్టించాడు. బౌండరీల మీద బౌండరీలు కొడుతూ 17 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 59 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వాహబ్ రియాజ్ వేసిన ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన అఫ్రిది ఆ ఓవర్లో మొత్తం 26 పరుగులు రాబట్టుకున్నాడు. ఫోర్త్ డౌన్‌గా వచ్చిన అఫ్రిది అకాశమే హద్దుగా చెలరేగి ఆడుతూ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇతని ధాటికి పక్తూన్స్ జట్టు నిర్ణీత10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన నార్తర్న్ వారియర్స్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. పూరన్ (5), ఆండ్రీ రసెల్ (0) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. తర్వాత ఓపెనర్ సిమన్స్ (16 బంతుల్లో 24) పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో రొమన్ పొవెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీల వర్షం కురిపించిన పొవెల్ 35 బంతుల్లోనే 4 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు చేసిన తమ జట్టుకి విజయాన్ని అందించలేక పోయాడు. మొత్తం 10 ఓవర్లు ముగిసే సరికి వారియర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పక్తూన్స్ జట్టుకు 13 పరుగుల విజయం దక్కింది. ఈ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన అఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
అఫ్రిది ధనాధన్… 17 బంతుల్లో 59
RELATED ARTICLES