HomeNewsBreaking Newsఅప్రమత్తంగా ఉండండి

అప్రమత్తంగా ఉండండి

ప్రజాపక్షం/హైదరాబాద్‌
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా ,వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ అయ్యే అవకాశం కూడా ఉందని తెలిపారు. ప్రతీ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం తోపాటు జిహెచ్‌ఎంసి, రాష్ట్ర సచివాలయంలోనూ కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన హైదరాబాద్‌లోని సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో శాంతికుమారి శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిజిపి జితేందర్‌, మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, పంచాయితీ రాజ్‌ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌, అగ్నిమాపక శాఖ డిజి నాగిరెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఆమ్రపాలి కాటా, మున్సిపల్‌ పరిపాలన విభాగం సంచాలకులు గౌతమ్‌ టెలీ కాన్ఫరెన్స్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శాంతి కుమారి మాట్లాడుతూ లోతట్టు, వరద ప్రాంతాల నుండి ప్రజలు వెళ్లకుండా తగు నిఘా పెట్టాలన్నారు. ముఖ్యంగా ఉదృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలన్నారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించుకునే నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్లను అప్పగించామని తెలిపారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల నుండి ప్రజలను తరలించి,వారికి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. భారీ వర్షాలు, వరదల వల్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్య పరచాలన్నారు. గ్రామాలు, పట్టణాలలోని మంచి నీటి ట్యాంకులను సరఫరా చేసి,కలుషిత నీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, అంటూ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్‌ పౌడర్‌, క్లోరినేషన్‌ లను చేపట్టాలని సూచించారు. వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తగు మందులను సిద్ధంగా ఉంచామన్నారు. ప్రస్తుతం ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు హైదరాబాద్‌, విజయవాడ లో ఉన్నాయని, ఏవిధమైన అవసరం ఉన్నా ముందస్తు సమాచారం ఇస్తేనే ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను పంపిస్తామన్నారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వరదలు, వర్షాల కారణంగా కొన్ని చోట్ల చేరువులకు స్థానికులు గండ్లు పెట్టె అవకాశం ఉందని, దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. నీటిపారుదల శాఖ అధికారులతో పర్యవేక్షించాలని, జిల్లాలో పోలీస్‌, నీటి పారుదల శాఖ, విపత్తుల నిర్వహణ, పంచాయితీ రాజ్‌ తదితర శాఖలతో కలిసి సమన్వయంతో పని చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు, మ్యాన్‌ హోల్‌ లను తెరవకుండా నిఘా పెట్టాలన్నారు. డిజిపి జితేందర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాలు, ఎస్‌పిలను అప్రమత్తం చేశామన్నారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్ల తో సమన్వయంతో పనిచేయాలని, అన్ని కమిషనరేట్లు, ఎస్‌.పి కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments