అప్రకటిత లాక్‌డౌన్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో స్తంభించిన కార్యకలాపాలు
సందర్శకులకు నో ఎంట్రీ
వరుస కేసులతో బల్దియా బేజార్‌
బోసిపోయిన జలమండలి, కలెక్టరేట్‌లు
స్వచ్ఛంద లాక్‌డౌన్‌లోకి వ్యాపార, వాణిజ్య మార్కెట్లు
ప్రజాపక్షం / హైదరాబాద్‌  : కరోనా మహమ్మారి హైదరాబాద్‌ మహానగరం లో నిత్యం విజృంభిస్తోంది. ప్రతి రోజు వెయ్యి కి చేరువలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతుండటంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అప్రకటిత లాక్‌డౌన్‌ వాతావరణం కొనసాగుతున్నది. కార్యాలయాలకు అధికారులు, సిబ్బంది రావాలంటేనే జంకుతున్నారు. జిహెచ్‌ఎంసి, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, జలమండలి, హెచ్‌ఎండిఎ, ఆర్‌టిఎ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సందర్శకులను అనుమతించకపోవడంతో కార్యాలయాలు బోసిపోతున్నాయి. అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే జిహెచ్‌ఎంసి, జలమండలిలలో క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు ఉన్నతాధికారులకు సైతం వైరస్‌ సోకడంతో అధికారులు, సిబ్బంది ఆం దోళన చెందుతున్నారు. పేరుకు కార్యాలయా లు తెరిచినా సందర్శకులను అనుమతించడం లేదు. ఎక్కువ మంది అధికారులు, సిబ్బంది కార్యాలయాలకు రావడానికి నిరాసక్తతను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో దాదాపుగా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే ఒక జోనల్‌ కమిషనర్‌, ఒకరిద్దరు డిప్యూటీ కమిషనర్‌లు, ముగ్గురు ట్యాక్స్‌ ఇన్స్‌స్పెక్టర్‌, జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్‌లో ఒక సిటీప్లానర్‌, మరో ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఎల్‌.బి.నగర్‌ సర్కిల్‌లో సెంక్షన్‌ ఆఫీసర్‌, కాప్రా, మల్కాజిగిరి సర్కిళ్లలో 50 మందికిపైగా ఎంటమాలాజీ సిబ్బందికి, సికింద్రాబాద్‌, ఖైతరాబాద్‌ జోనల్‌ కార్యాలయాల్లో పలువురికి వైరస్‌ నిర్ధారణ కావడంతో పరిమిత సంఖ్యలో అధికారులు, సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా క్షేత్ర స్థాయిలో సోడియం హైపో సోడియం పిచికారి చేసే ఎంటమాలాజీ సిబ్బందికి మల్కాజిగిరి, కాప్రా సర్కిళ్ల పరిధిలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సైతం కార్యకలాపాలు కొనసాగడం లేదు. అధికారులు, సిబ్బంది పెద్దగా హాజరు కావడం లేదని చెబుతున్నారు. వంతుల వారీగా షిప్టుల వారీగా రోజు రోజు విడిచి విధులకు వెళ్తున్నామని కొంతమంది సిబ్బంది చెప్పారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సైతం సందర్శకులను అనుమతించడం లేదు. తాజాగా అమీర్‌పేట తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తహసీల్దార్‌ కార్యాలయాన్ని శానిటైజ్‌ చేశారు. సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక హెచ్‌ఎండిఎ కార్యాలయంలో సైతం సందర్శకులను అనుమతించకపోవడంతో కార్యకలాపాలు పెద్దగా జరగడం లేదని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇక వాటర్‌బోర్డ్‌ కార్యాలయాల్లో పరిమిత సంఖ్యలోనే అధికారులు, సిబ్బంది వస్తున్నారు. సందర్శకులను కలిసేందుకు ఉన్నతాధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో కార్యాలయాలు పని చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
స్వచ్ఛంద లాక్‌డౌన్‌లో మార్కెట్లు, దుకాణాలు…
కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుండటంతో నగరంలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయారు. రాష్ట్రంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన బేగంబజార్‌లో వచ్చేనెల 5వ తేదీ వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నామని వ్యాపారులు ప్రకటించిన విషయం తెల్సిందే. బేగంబజార్‌ వ్యాపారుల కంటే ముందే సికింద్రాబాద్‌ జనరల్‌బజార్‌, రాణిగంజ్‌, సిటీలైట్‌ హోటల్‌ పరిసర ప్రాంతాలు, చార్మినార్‌ సమీపంలోని లాడ్‌బజార్‌, ఇస్లామిక్‌ పుస్తకాల విక్రయ దుకాణాలు, మలక్‌పేట్‌ మర్కెట్‌లు బంద్‌ పాటిస్తున్నాయి. వీరిలో శివారు ప్రాంతాల్లోని మార్కెట్‌లు సైతం బంద్‌ బాటపట్టాయి. షాపూర్‌నగర్‌, కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌, ఇసిఐఎల్‌, ఉప్పల్‌, ఎల్‌.బి.నగర్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో మార్కెట్లు మూతపడుతున్నాయి. ఇక నగరంలో సాధారణ కిరణా మర్చెంట్‌ దుకాణాలు సైతం తెరవడానికి వ్యాపారులు భయపడుతున్నారు. చిన్న చిన్న దుకాణాలు తెరవడానికి జంకుతున్నారు. కరోనా భయంతో నగర వ్యాపారులు, దుకాణాదారులు సైతం స్వచ్ఛంద లాక్‌డౌన్‌లోకి వెళ్ళిపోతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?