రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేత
విద్యాసంస్థల మూసివేత కొనసాగింపు
యోగా, జిమ్ కేంద్రాలకు అనుమతి
మెట్రోరైళ్లు, హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లపై నిషేధం యథాతథం
కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు ఆగస్టు 31 వరకు పొడిగింపు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గ్రీన్‌సిగ్నల్
క్రీడలు, సభలు, సమావేశాలకు ‘నో’
న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసే క్రమంలో అన్‌లాక్ 3.0 పేరుతో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ఇచ్చిం ది. అన్‌లాక్ 2.0 జులై 31వ తేదీతో ముగుస్తున్న దృష్ట్యా ప్రభుత్వం అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అన్‌లాక్ 3.0లో రాత్రిపూట ఉన్న కర్ఫ్యూను పూర్తిగా తొలగించారు. అయితే కంటైన్‌మెంట్ జోన్లలో ఆగస్టు 31వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. విద్యాసంస్థలు తెరుచుకోవడంపై నిషేధా న్ని కొనసాగించాలని, వ్యాయామశాల లు, యోగాసెంటర్లకు అనుమతినివ్వాల ని నిర్ణయించింది. అయితే మెట్రోరైళ్లు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు మూసివేత కొనసాగుతుంది. ఈ అన్‌లాక్ 3.0
ఆగస్టు 31వ తేదీ వరకు అమల్లో వుంటుంది. అప్పటివరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ కొనసాగుతుంది. అయితే కరోనా కేసుల పరిస్థితిని బట్టి మార్పులు జరిగే అవకాశం వుందని ప్రకటించింది. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కేంద్రం అనుమతినిచ్చింది. ఇక సామాజిక, రాజకీయ, క్రీడ, వినోద, మతపరమైన సమావేశాలపై ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించిన మీదటే విద్యాసంస్థలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
మార్గదర్శకాలు ఇవీ
రాత్రి పూట కర్ఫ్యూ ఎత్తివేత
ఆగస్టు 5 నుంచి యోగా కేంద్రాలు, జిమ్‌లకు అనుమతి
భౌతిక దూరం, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు.
స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేత
వందేభారత్ మిషన్ కింద అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు పరిమితంగా అనుమతులు
సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
ఆగస్టు 31 వరకు మెట్రో రైళ్లు నడవవు
సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేటర్లు, ఆడిటోరియంలు, బార్లు, అసెంబ్లీ హాళ్లు తదితర ప్రదేశాలు మూసివేత కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది)
సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా, వినోద, విద్యా, మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది)
ఆగస్టు 31 వరకు కంటైన్‌మెంట్ జోన్లలో కఠినంగా ఆంక్షలు అమలు (కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల అమలు బాధ్యత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలదే)