అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకోండి

కరోనాకు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజు వసూలపై హైకోర్టు వ్యాఖ్య
ప్రజాపక్షం / హైదరాబాద్‌  కరోనా నివారణకు వైద్యం చేసే కార్పొరేట్‌ ఆస్పత్రులు ప్రభుత్వ జిఒలో నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువగా వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించిన వృత్తిపరమైన నైతిక ప్రమాణాలను పాటించడం లేదని న్యాయవాది శ్రీకిషన్‌ శర్మ వేసిన పిల్‌ను చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. మీడియా వార్తల ప్రకారం ప్రైవేట్‌ ఆస్పత్రులు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా ఉందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో అందుకు కారణాలను, చర్యలు తీసుకుని ఉంటే వాటిని తెలియజేయాలని ఆదేశించింది. ప్రభుత్వాసుపత్రిలో డిఎంఒగా చేసే సుల్తానాకు కరోనా పోజిటివ్‌ వస్తే చాదర్‌ఘాట్‌లోని తుంబె ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేరితే రూ.1.5 లక్షలు చెల్లించిన తర్వాతే డిశ్చార్జి చేసిన ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు యశోదా సూపర్‌ స్పెషాలిటీ కేర్‌ షన్‌సైన్‌ ఆస్పత్రులకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?