భూపాలపల్లి: ‘‘మా ప్రభుత్వం వచ్చాక.. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాం. మీకు సరైన ధర ఇవ్వకుండా భూములు తీసుకొనే వీలు లేకుండా చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.2లక్షల మేరకు రుణాలను మాఫీ చేస్తాం. 17 పంటలకు మద్దతు ధర ఇస్తాం. వరి పంటకు రూ.2 వేలు, పత్తి పంటకు రూ.7వేలు, మిర్చికి రూ.10వేలు మద్దతు ధర ఇస్తాం’’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. భూపాలపల్లిలో జరిగిన ప్రజాకూటమి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భూసేకరణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చాయని విమర్శించారు. ఐదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడ్డప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే కలను కన్నారు. దీనికి మన నీళ్లు మనకే ఉండాలని ఆ రోజు ఆలోచన చేసి, యుపిఎ ప్రభుత్వంలో మొత్తం దేశంలోనే గిరిజనులకు సంబంధించి భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. కానీ ఆ ప్రయోజనం గిరిజనులకు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ ఆ బిల్లు ఫలాలను మీకు అందనివ్వలేదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ బిల్లును అమలు చేస్తామన్నారు. గిరిజనుల జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్ అమలు చేస్తాం. పోడు భూముల హక్కు పత్రాలను మీకు ఇస్తాం. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారు. మీ రక్తాన్ని తెలంగాణ కోసం వెచ్చించారు. కానీ కెసిఆర్ మిమ్మల్ని కూడా మోసం చేశారు. కెసిఆర్ హామీలు ఎంతవరకు నిజమో మీరే ఆలోచించుకోవాలి. మా మేనిఫెస్టోలో సింగరేణి కాలరీస్, కార్మికుల అంశాలను చేర్చాం. సింగరేణిలో తాత్కాలికంగా పని చేస్తున్న వారిని కూడా రెగ్యూలరైజ్ చేస్తాం. తొలగించిన కార్మికులను మళ్లీ తీసుకుంటాం. మీ పిల్లలకు విద్య, వైద్యం అందేట్లు చూస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తాం
RELATED ARTICLES