మణిపూర్ హింసపై విపక్ష సభ్యుల ఆందోళనలు
పార్లమెంటులో కొనసాగుతున్న వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఉభయసభలు ప్రారంభం కాగానే కర్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకొని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తరువాత విపక్ష సభ్యులు మణిపూర్‌పై ప్రధాని మోడీ మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే కొంతసేపు సభా కార్యకలాపాలు కొనసాగాయి. అటు తరువాత నుంచి పలు మార్లు సభలు వాయిదా పడ్డాయి. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవ-డంతో చివరకు లోక్‌సభను స్పీకర్ ఓమ్ బిర్లా గురువారానికి వాయిదా వేశారు. అంతకు ముందు లోక్‌సభ రెండు మార్లు వాయిదా పడింది. అయితే సమావేశాల సందర్భంగా ఇతర ప్రతిపక్షాల మద్దతుతో కాంగ్రెస్ మోడీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానంపై నోటీసు ఇచ్చింది. దానిని స్పీకర్ అనుమతించారు. ఈ చర్య వల్ల మణిపూర్, ఇతర ముఖ్య అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధానికి తెరపడనుంది. సభా కార్యకలాపాలు కొనసాగిన అతి కొద్ది సమయంలోనే ప్రభుత్వం ఆరు బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. అటవీ పరిరక్షణ చట్టం సవరణ బిల్లును సభ ఆమోదించింది. కాగా, ఉదయం సభ ప్రారంభమైన తరువాత మణిపూర్ అంశాన్ని చేపట్టాలని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తరువాత స్పీకర్‌క ఓమ్‌బిర్లా మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గగోయ్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు సభ్యులకు తెలియజేశారు. తీర్మానంపై చర్చకు తేదీను ఖరారు చేయాల్సి ఉందన్నారు. అయితే తీర్మానానికి మద్దతు ఇచ్చే వారకు లేచి నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీ, ఎన్‌సి చీఫ్ ఫరూక్ అబ్దుల్లా సహా ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు లేచినిలబడగా, స్పీకర్ వారిని లెక్కించి తీర్మానానికి అనుమతించారు. సభా కార్యక్రమాలను జాబితాను స్పీకర్ సభ్యులకు అందించగా, ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసు అంశాన్ని లేవనెత్తారు. నియమ, నబంధనల ప్రకారమే సభ నడుస్తుందని బిర్లా హెచ్చరించారు. తరువాత ఆరు బిల్లులను సభ ముందు ఉంచారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను ఉధృతం చేయగా, సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
మైక్ కట్ చేయడం.. నాకు ’అవమానమే’ : ఖర్గే
అటు రాజ్యసభలోనూ విపక్షాలు మణిపూర్ అంశాన్ని లేవనెత్తగా, వారి ఆందోళనల మధ్యే కొంతసేపు కార్యకలాపాలు కొనసాగించారు. ఆ తరువాత విపక్ష సభ్యులు పోటీగా అధికారపక్ష సభ్యులు కూడా నినాదాలు చేశారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతున్న తాను క్రమంలో మైక్ కట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది తన ఆత్మాభిమానాన్ని సవాలు చేయడమేనన్న ఆయన.. చైర్మన్ అనుమతితో మాట్లాడుతున్నప్పటికీ మైక్ కట్ చేయడం తనను అవమానించడమేనన్నారు. పలు అంశాలను సభ దృష్టికి తీసుకువస్తున్నాని చెప్పారు. ‘267 కింద 50మంది నోటీసులు ఇచ్చినప్పటికీ పార్లమెంటులో మాట్లాడేందుకు నాకు అవకాశం రాలేదు. కనీసం నేను మాట్లాడేటప్పుడైనా.. అది పూర్తికాకుండానే నా మైక్‌ను ఆఫ్ చేశారు. ఇది నా హక్కులకు భంగం కలిగించడమే. ఇది నాకు అవమానకరమే. వాళ్లు నా ఆత్మగౌరవాన్ని సవాలు చేశారు. ఒకవేళ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సభ నడుస్తుందనుకుంటే.. అది ప్రజాస్వామ్యం కాదనే నేను భావిస్తా’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. మంగళవారం సభలో చోటుచేసుకున్న వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ అధికార పక్షం తీరుపై మల్లికార్జున ఖర్గే తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత అలా మాట్లాడిన వెంటనే విపక్షసభ్యులు ఆయనకు మద్దతుగా నిలిచి నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా ’మోడీ మోడీ’ అంటూ ప్రతి నినాదాలు చేయడంతో సభ మొత్తం గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో సభను క్రమపద్ధతిలోకి తీసుకురావాలని విపక్షనేత ఖర్గేతో పాటు సభాపక్షనేత పీయూష్ గోయల్‌లకు చైర్మన్ జన్‌దీప్ ధన్‌ఖడ్ విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఇరుపక్షాల సభ్యుల నినాదాలతో ఎగువసభ హోరెత్తిపోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
అదే వరస
RELATED ARTICLES