‘మీ గవర్నర్’ పదప్రయోగంపై అసెంబ్లీలో వాగ్వాదం
కెసిఆర్ వివరణపై ప్రతిపక్షం అభ్యంతరం
మీరలా మాట్లాడొద్దు : సిఎం
ప్రజాపక్షం / హైదరాబాద్: రాష్ట్ర రెండో శాసనసభ తొలి సమావేశాల్లో ఆదివారం సిఎం కెసిఆర్, ప్రతిపక్ష నేత భట్టివిక్రమార్క మధ్య స్వల్ప వాగ్వా దం చోటుచేసుకుంది. ఒక సందర్భంలో సభ్యులు అలా మాట్లాడవద్దని సిఎం పేర్కొనగా అందుకు విపక్ష నేత భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యకం చేస్తూ సభ్యులు లేవనెత్తిన అంశాలకు సమాధానమివ్వడం సిఎం బాధ్యత అని, ఎత్తిపొడవడం సరైంది కాదన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఈ వాగ్వాదం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు గండ్ర వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ ‘మీ గవర్నర్’ అని సంబోధించడం, ప్రసంగపాఠంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అనే పదాలని మార్చాలని కోరడంతో సిఎం జోక్యం చేసుకుని ఆయనను తప్పుబట్టారు. అదే విధంగా చర్చకు సిఎం కెసిఆర్ సమాధానమిస్తూ మరోసారి గండ్రను ఉద్దేశించి కంటి వెలుగు శస్త్రచికిత్సల గురించి తప్పుగా మాట్లాడారని, సభ్యులు అలా మాట్లాడవద్దని అన్నారు. ఇందుకు విపక్ష నేత భట్టివిక్రమార్క స్పందిస్తూ సభ్యులు మాట్లాడిన విషయాలపై ఎత్తిపోడవడం సరైంది కాదని, సిఎం హోదాకు అది తగదన్నారు. సభ్యులు తమకు తెలిసిన, మీడియాలో వచ్చిన అంశాల ఆధారంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తారని, వాటికి సమాధానమివ్వడం సిఎం బాధ్యత అని, సభ్యులు చెప్పిన విషయాలపై ఎత్తిపొడవడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ హయాంలో రెవెన్యూ రికార్డులను సవరించలేదని సిఎం పదే పదే మాట్లాడడం సరైంది కాదని, రెవెన్యూ సదస్సుల ద్వారా ఎప్పటికప్పుడు రికార్డులను అప్‌గ్రేడ్ చేశామని, ప్రతి ఏటా నిర్వహించే రెవెన్యూ సదస్సులను టిఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేసి ఒకే రికార్డులను సరిచేసేందుకు పూనుకుందని భట్టి అన్నారు. ఇందుకు సిఎం కెసిఆర్ స్పందిస్తూ గత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యంగా చేసిందని, నిజాం కాలం నాటి రాకార్డులే ఉన్నాయని, ఇవన్నీ చెబితే మళ్లీ సభ్యులను ఎత్తిపొడుస్తున్నారని అంటారని పేర్కొన్నారు.