HomeNewsTelanganaఅదనపు ఆదాయంపై వినూత్న మార్గాల అన్వేషణ

అదనపు ఆదాయంపై వినూత్న మార్గాల అన్వేషణ

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో భారీ అంచనాలు
మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేరుస్తాం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క
ప్రజాపక్షం/హైదరాబాద్‌

అదనపు ఆదాయం వచ్చేలా వినూత్న మార్గాలను అన్వేషించాలని రవాణ శాఖ అధికారులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. సన్నహక బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రవాణ, బిసి సంక్షేమ శాఖల పద్దులపై రాష్ట్ర రవాణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సంబంధిత
అధికారులతో కలసి సమావేశం నిర్వహించారు.
ఆర్‌టిసిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది..
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహాలక్ష్మి కార్యక్రమం అమలులో ఆర్‌టిసిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందన్నారు. రవాణ శాఖ పనితీరును మెరుగుపరిచేందుకు ఇంకా ఆస్కారం ఉందని, అంతర్గత ఆదాయం వనరులు పెంపొందించుకునే మార్గాలను కూడా అన్వేషించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి ఆశించిన మేరకు రాబడులు లేనందున, వాస్తవ పరిస్థితిలకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
మెట్రోరైల్‌ తరహాలో ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలి..
కార్పొరేషన్‌ నష్టాలను తగ్గించేందుకు ఆర్‌టిసి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆర్‌టిసి ఖర్చులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే మెట్రోరైలు తరహలో ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషించాలని కోరారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వివిధ నమూనాలను అధ్యయనం చేయాలన్నారు. బిసి రెసిడెన్షియల్‌ పాఠశాలల పనితీరును మెరుగుపరిచేందుకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చేతివృత్తుల వారి నైపుణ్యాలను పెంపొందించేందుకు వివిధ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు.
కొత్త బస్సుల కొనుగోలు, నియమాకాలు జరపాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌
మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల కొత్త బస్సులను కొనుగోలు చేయల్సిన అవసరం ఏర్పడిందని, ఆర్‌టిసిలో నియమాకాలు చేపట్టాలనే డిమాండ్‌ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బిసి సంక్షేమ శాఖ ద్వారా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కల్యాణలక్ష్మి, స్కాలర్‌షిప్‌లు, వివిధ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌లకు ఆర్థిక సహాయం వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన తరగతుల వారి కోసం ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బిసి గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలన్నారు.
ఓవర్సిస్‌ స్కాలర్‌ షిప్‌లు పెంచాలి..
ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సిస్‌ స్కాలర్‌ షిప్‌ మంజూరు చేస్తుండగా వాటిని మరింత మందికి పెంచాలని కోరారు. కుల వృత్తుల్లో ఉన్నవారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చేందుకు అధ్యయనం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్‌ రాజు, బిసి సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, రవాణ శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments