అత్యంత ప్రమాదకరం

కేంద్ర విద్యుత్‌ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం
విద్యుత్‌ చట్టం సవరణ బిల్లు ప్రజలకు పనికి వచ్చేది కాదు
రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, హక్కులను హరించే, దేశ సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితో అడ్డంగా నరికే భయంకరమైన బిల్లు
శాసనసభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రమైన విమర్శలు
ప్రజాపక్షం / హైదరాబాద్‌ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన “విద్యుత్‌ చట్టం- 2003 సవరణ బిల్లు”ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిం ది. “కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం- 2003 సవరణ బిల్లును తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా, రైతులు, పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని, కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది” అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఎంఐఎం, కాంగ్రెస్‌ పక్షాలు మద్దతు ఇవ్వడంతో సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
బిల్లును పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తున్నాం : సిఎం
కేంద్ర విద్యుత్‌ చట్టం -2003 సవరణ బిల్లు అత్యంత ప్రమాదకరమని, ఈ బిల్లును పార్లమెంట్‌లో పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని శాసనసభ వేదికగా
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్‌ చట్టం సవరణ బిల్లుపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సిఎం కెసిఆర్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ చట్టం సవరణ బిల్లు ప్రజలకు పనికి వచ్చేది కాదు. రైతులకు గొడ్డలిపెట్టు, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని, హక్కులను హరించే, దేశ సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితో అడ్డంగా నరికే భయంకరమైన బిల్లు” అని సిఎం కెసిఆర్‌ అన్నారు. కేంద్రం తెచ్చే కొత్త విద్యుత్‌ చట్టంతో రాష్ట్రాలకు నియంత్రణ ఉండదని, ప్రజలకు సబ్సిడీలు ఉండవని, జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ సంస్థలు ఉండవని, ఈ విద్యుత్‌ చట్టాన్ని అనేక రాష్ట్రాలు, దేశంలోని వివిధ విద్యుత్‌ సంస్థలలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారని సిఎం కెసిఆర్‌ తెలిపారు. విద్యుత్‌ రంగంలో రాష్ట్రాల హక్కులు హరించారని, కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లు చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. నమూనా బిల్లు కూడా పంపించారని, ఈ నేపథ్యంలోనే తాను ప్రధానమంత్రికి లేఖ రాశానని, బిల్లు ఉపసంహరించుకోవాలని బ్రతిమిలాడినా వినడం లేదని తెలిపారు. ఈ బిల్లు వల్ల రాష్ట్రాల విద్యుత్‌ లోడ్‌ సెంటర్లు అన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్తాయన్నారు. విద్యుత్‌ రంగం ప్రభుత్వం వద్ద ఉంటే డిస్కంలు, ట్రాన్స్‌ కో, జెన్‌ కో అభివృద్ధి చెందుతాయని, ఈ సంస్థలు లేకుంటే వేలాది మంది ఉద్యోగాలు పోతాయన్నారు. కేంద్ర విద్యుత్‌ చట్టం వస్తే ఇష్టారాజ్యంగా ప్రైవేటు కంపెనీలు వస్తాయని, ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తారన్నారు. కేంద్ర విద్యుత్‌ చట్టం వస్తే ఇఆర్‌సి నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదని స్పష్టం చేశారు. కేంద్ర విద్యుత్‌ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని సిఎం కెసిఆర్‌ చెప్పారు. కొత్త చట్టం ప్రకారం పొలంలోని ప్రతి బోరుకు మీటర్లు పెట్టాల్సి వస్తుందన్నారు. కొత్త మీటర్ల కోసం రూ. 700 కోట్లు కావాలన్నారు. మీటర్‌ రీడింగ్‌ తీస్తారని, బిల్లులు ముక్కు పిండి వసూలు చేస్తారన్నారు. తన చిన్నప్పుడు బిల్లు కలెక్టర్‌ను చూస్తే రైతులు ఎంతో భయపడేవారన్నారు. రాష్ట్రంలోని 26 లక్షల బోర్లకు మీటర్లు పెట్టేందుకు రాష్ట్ర బిజెపి నేతలు ఒప్పుకుంటారా అని సిఎం ప్రశ్నించారు. ఈ విషయంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి, ఎంపిలు, బిజెపి నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని సిఎం డిమాండ్‌ చేశారు. దేశంలో 70 వేల టిఎంసిల నీరు ఉన్నప్పటికీ చెన్నైలో తాగునీటికి అనేక సమస్యలు ఉన్నాయని, దేశంలో 75 శాతం మంది మంచినీటి కోసం అల్లాడుతున్నారన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలనే దృక్పథం బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలకు లేకుండా పోయిందన్నారు. దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉందని, పుష్కలంగా సరిపోయే నీరు ఉన్నప్పటికీ సాగుకు ఇవ్వలేదన్నారు. మరోవైపు దేశంలో స్థాపిత విద్యుత్‌ శక్తి 4 లక్షల మెగావాట్ల పైనే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 2.16 లక్షల మెగావాట్లు మాత్రమే ఉపయోగించారని, మిగులు విద్యుత్‌ను దేశ ప్రగతికి వినియోగించాలనే ఉద్దేశం, ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చే ప్రణాళిక కేంద్రం దగ్గర లేదని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని పరిపాలించే విధానంలో అంబేడ్కర్‌, ఇతర గొప్ప వ్యక్తులు ప్రవేశపెట్టిన ఆదేశిక సూత్రాలను ఉల్లంఘిస్తున్నారని సిఎం కెసిఆర్‌ ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారని సిఎం విమర్శించారు. కరోనా కారణంగా 3 నెలల బిల్లులు ఒకేసారి వచ్చాయని, విద్యుత్‌ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని సిఎం కెసిఆర్‌ ప్రకటించారు.
విద్యుత్‌ బిల్లుపై కేంద్రానికి
సూచనలు చేశారా?
ప్రజాపక్షం / హైదరాబాద్‌  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిఎస్‌టి బిల్లును తీసుకువచ్చినప్పుడే రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌ ప్రభు త్వం మాట్లాడాల్సిందని, రాష్ట్రాల అధికారం కేంద్రం చేతుల్లోకి పోతే ఇతర రాజకీయ పార్టీలను, రాష్ట్రాలను తమ చెప్పుచేతుల్లో పెట్టుకుని నియంత్రించుకునే ప్రమాదం ఉంటుందని సిఎల్‌పి పక్షం నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. కేంద్రం విద్యుత్‌ బిల్లును ప్రవేశపెట్టిందా, దీనిపై కేంద్రానికి సలహాలు, సూచనలు చేశారా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం కోరితే మన వైఖరి ఎలా ఉండాలి? అడుగకపోతే ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. శాసనసభలో మంగళవారం కేంద్ర విద్యుత్‌ బిల్లుపై జరిగిన లఘు చర్చలో భట్టివిక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ బిల్లుకు సంబంధించిన అన్ని అంశాలను వెల్లడించాలని, ఈ రంగానికి సంబంధించిన వారితో, రాజకీయ పార్టీలతో చర్చించాలని ఆయన కోరారు. దేశంలో మిగులు విద్యుత్‌ ఉన్నదని, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా విద్యుత్‌ వచ్చిందని, టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంతా తామే చేశామని చెప్పుకుంటున్నదని విమర్శించారు. కొవిడ్‌ వ్యాప్తి వల్ల లాక్‌డౌన్‌ విధించిన కారణంగా విద్యుత్‌ బిల్లులు భారీగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లాక్‌డౌన్‌ సమయంలో మూడు నెలల బిల్లు కలిపి ఒకేసారి వేయడం వల్ల తనకు రూ.55 వేల బిల్లు వచ్చిందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని భట్టివిక్రమార్క తెలిపారు. వేల రూపాయల్లో విద్యుత్‌ బిల్లులు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు.
లాక్‌డౌన్‌ విద్యుత్‌ బిల్లులను పరిష్కరిస్తాం ః సిఎం
ఇందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్పందిస్తూ విద్యుత బిల్లుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. మూడు నెలలకు కాకుండా ఏ నెలకు ఆ నెల బిల్లు వేసి లోపాలను సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని సిఎం హామీ ఇచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?