సైన్యాన్ని దించుతా : ట్రంప్ బెదిరింపు ఫ్లాయిడ్‌ది నరహత్యే : నివేదిక
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి వర్ణవివక్ష భగ్గుమన్న నేపథ్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లా యిడ్ మరణోదంతంపై అమెరికా అట్టుడుకుతోం ది. వరుసగా ఏడో రోజు కూడా హింసాత్మక ఘటనలతో కూడిన ఆందోళనలు చెలరేగాయి. ఆరు రోజులుగా నడుస్తున్న ఈ ఆందోళన ఫలితంగా దాదాపు పది మంది ప్రాణాలు కోల్పోగా, పోలీసులు వేల మందిని అరెస్ట్ చేశారు. నలభై నగరా ల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఓ రహస్య స్థావరం లో తలదాచుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల తర్వాత బయటకు వచ్చి జనంపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆందోళనల ను అణగదొక్కేందుకు, అవసరమైతే సైన్యాన్ని రంగంలోకి దించుతానని ట్రంప్ హెచ్చరించారు. మినసోటాలో మొదలైన ఆందోళన పర్వం దావానలంలా లాస్ ఏంజిలెస్, షికాగో, న్యూయార్క్, హ్యూస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌లకూ విస్తరించింది. పలు దేశాల్లో ఆందోళనకారులకు మద్దతు లభించింది. న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ సిటీలో వేలాదిగా ఆందోళనకారులు నిరసనప్రదర్శన చేపట్టారు. సెంట్రల్ లండన్‌లో ఆదివారం పలువురు ఆందోళనకారులు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతానికి నిరసనగా ప్రదర్శన నిర్వహించగా, బ్రెజిల్, కెనడా, చైనాలో ప్రదర్శనలు జరిగాయి. కాగా, ఈ స్థాయి ఆందోళనలు 1968లో మార్టిన్ లూథర్‌కింగ్ హత్య తరువాత మాత్రమే జరిగాయని న్యూ యార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. కొన్ని చోట్ల ప్రజలు షాపులు, కంపెనీల లూటీకి పాల్పడ్డారు. కాగా, మినెసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గత సోమవారం జార్జ్ ఫ్లాయిడ్ అనే ఓ నల్ల జాతి వ్యక్తిని అదుపులోకి తీసుకునే క్రమంలో తెల్ల జాతి పోలీస్ అధికారి డెరెక్ షావిన్ అతని మెడపై మోకాలితో బలంగా నొక్కుతుండగా ప్రాణాలు కోల్పోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు హ్యూస్టన్‌లో జరగనున్నాయి. ఇదిలావుండగా, ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌ వద్ద భారీ స్థాయిలో నిరసన చెలరేగిన నేపథ్యంలో భారీ ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాజధాని నగరంలో హింసాత్మక నిరసనలను అరికట్టడానికి అదనపు బలగాలను పంపుతున్నామన్నారు. అవి శాంతియుత నిరసనలు కావంటూ మండిపడ్డారు. ఈ అల్లర్లను దేశీయ ఉగ్రవాద చర్యలుగా ఆయన అభివర్ణించారు. వాషింగ్టన్‌లో అల్లర్లు, దోపిడీలు, దాడులు, ఆస్తి విధ్వంసాలను ఆపడానికి వేలాది మంది సాయుధ సైనికులు, ఇతర పొలీసు అధికారులను పంపిస్తున్నానని ప్రకటించారు.అలాగే, శాంతిభద్రతల అధ్యక్షుడిగా తనని తాను ట్రంప్ ప్రకటించుకున్నారు. హింసను నియంత్రించడానికి వీలైనంత ఎక్కువ నేషనల్ గార్డ్ దళాలను ఉపయోగించాలని గవర్నర్లను ట్రంప్ కోరారు. అల్లర్లకు పరోక్షంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లే కారణమని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది గవర్నర్లు శక్తిహీనులుగా మారారని వ్యాఖ్యానించారు. మరోవైపు జార్జ్ ఫ్లాయిడ్ (46) మరణంపై కీలక మైన అధికారిక పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని, ఇది నరహత్య అని మినియాపోలిస్‌లోని హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అదుపులో ఉండగా అతడు గుండెపోటుకు గురైనట్లు నివేదిక తెలిపింది. అటు ఫ్లాయిడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్షల విచారణలోనూ ఇది పోలీసుల హత్యగానే నిర్ధారణ అయింది. పోలీసులు జార్జ్‌ని నిరోధిస్తున్నపుడే..గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. మెడపై ఒత్తిడి కారణంగా మెదడుకు రక్త ప్రవాహం ఆగిపోవంతో మరణించాడని పరీక్షల్లో తేలినట్టు ఫ్లాయిడ్ కుటుంబానికి చెందిన న్యాయవాది బెంజమిన్ క్రంప్ విలేకరుల సమావేశంలో తెలిపారు. పోలీసుల అమానుషంతోనే అతను మరణించాడని, అంబులెన్సే జార్జ్‌కు పాడెగా మారిందని వ్యాఖ్యానించారు. కాగా, మినియాపోలిస్‌లో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. నగర మేయన్ సిల్వర్‌స్టర్ టర్నల్ శనివారమే అంత్యక్రియల ప్రణాళికను ప్రకటించగా.. ఎప్పుడు?అన్నది స్పష్టం చేయలేదు. నార్త్ కారొలీనాలో జన్మించిన ఫ్లాయిడ్ హ్యూస్టన్‌లో పెరిగి పెద్దయ్యారు. 2014 నుంచి ఫ్లాయిడ్ మినియాపోలీస్‌లో ఉంటున్నా అతడి ఇద్దరు కూతుళ్లు హ్యూస్టన్‌లో ఉంటున్నారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఫ్లాయిడ్ మృతదేహాన్ని మినియాపోలీస్ నుంచి హ్యూస్టన్‌కు తరలించనున్నారు.