HomeNewsBreaking Newsఅందరి చూపు.. ‘ఇండియా’ వైపు

అందరి చూపు.. ‘ఇండియా’ వైపు

విపక్షాల సమావేశంపై సర్వత్రా ఆసక్తి
న్యూఢిల్లీ:
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి పెరుగుతున్నది. ఈనెల 31న ముంబయిలో జరగనున్న ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలియన్స్‌ (ఇండియా) రెండు రోజుల సమావేశంపై అందరి చూపు కేంద్రీకృతమైంది. 26 ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ఈ కూటమిలో ఉన్నాయి. మరికొన్ని పార్టీలు కూడా జతకలిసే అవకాశం ఉంది. విపక్షాల కూటమి నిర్వహించే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా, కూటమి లోగో ఆవిష్కరణ ఉంటుందని అంటున్నారు. అదే విధంగా కేంద్రంలోని బిజెపి సర్కార్‌ ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఖరారు చేసే అవకావాలు ఉన్నాయి. ‘ఇండియా’ తొలి సమావేశం ఈ ఏడాది జూన్‌ మాసంలో పాట్నా వేదికగా జరిగింది. బెంగళూరులో జరిగిన రెండో సమావేశంలో కూటమి పేరును ‘ఇండియా’గా ఖరారు చేశారు. ముంబయిలో జరిగే సమావేశానికి మరికొన్ని పార్టీలు కూడా హాజరవుతాయని అంచనా. అయితే, ఈ కూటమి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీహార్‌ ముఖ్యమంత్రి, జెడియు చీఫ్‌ నితీష్‌ కుమార్‌ మాత్రం ఈ విషయంలో గోప్యతను పాటిస్తున్నారు. ఏఏ పార్టీల నేతలు హాజరవుతారనే విషయంలో వివరాలను ప్రటించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీనితో ముంబయి సమావేశంపై మరింత ఉత్కంఠ కొనసాగుతున్నది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి, బిజెపిని ఓడిస్తాయని నితీష్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కొన్ని పార్టీలు ముంబయి సదస్సులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని శివసేన (ఉద్ధవ్‌ థాక్రే) నాయకుడు సంజయ్‌ రావత్‌ ఇటీవల చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, సీనియర్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారు. ఇలావుంటే, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు దాదాపుగా ఖరారైందని కాంగ్రెస్‌ నాయకుడు మిలింద్‌ దేవరా ప్రకటించారు. ముంబయి సమావేశంలో ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. అయితే, కూటమిలోని అన్ని పార్టీల ఏకాభిప్రాయంతోనే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మహా వికాస్‌ అఘాడీలో భాగస్వాములైన శివసేన (ఉద్ధవ్‌ థాక్రే), కాంగ్రెస్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) ఇప్పటికే వివిధ కమిటీలు వేసుకొని, రానున్న ఎన్నికలకు సంబంధించిన అనేక విభాగాలను అధ్యయనం చేస్తున్నాయి. ఈ కమిటీల అభిప్రాయాలను, సూచనలను ముంబయి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద ‘ఇండియా’ కీలక సమావేశంలో చర్చకు వచ్చే అంశాలు.. ఆమోదించే తీర్మానాలు.. తీసుకోబోయే నిర్ణయాలపై యావత్‌ దేశం ఎంతో ఆసక్తిగానూ, ఉత్కంఠగానూ ఎదురుచూస్తున్నది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments