ఏబిఎన్ పై నిషేధం..

ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. మీడియా మొత్తం అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ చంద్రబాబుకు భజన చేస్తున్న నేపథ్యంలో జగన్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ పార్టీ వార్తల కవరేజీకి ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబిఎన్ ఛానల్ ప్రతినిధులను పిలిచేదిలేదని స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు రాస్తూ, కర్ణకఠోరమైన వ్యాఖ్యలు విన్పిస్తూ పత్రిక, టీవీల్లో ప్రతినిథ్యం జగన్ పై ఆ మీడియా బురద జల్లుతూనే ఉంది.

ఉన్నదిలేనిదీ కల్పించుకుని ఒంటికాలిపై లేస్తుంటుంది. చంద్రబాబుపై ఈగ వాలకుండా చూస్తుంటుంది. సరే.. చంద్రబాబుపై ప్రేమ ఉంటే ఆయన గురించి ఎంత గొప్పగా రాసుకున్నా ఇతరులకు ఇబ్బందేమీ ఉండదు. కానీ ప్రధాన ప్రతిపక్షంపై తప్పుడు వార్తలు రాస్తేనే సమస్య వస్తుంది.

ఇటీవల జగన్ ప్రధానిని కలిస్తే ఆరోజు వారి మధ్య ఏంచర్చకు వచ్చిందన్న విషయంలో వేమూరి రాధాకృష్ణ ఓవరాక్షన్ చేశారు. ఆయనేదో దగ్గరుండి అన్నీ విన్నట్లు.. చూసినట్లుగా ఓ పాత ఫిర్యాదు కాపీని అచ్చోసి ఇదే ఆరోజు జగన్ ఇచ్చిందన్నట్లు తెలుగు ప్రజలను నమ్మించే పని చేశారు. కానీ అది బూమ్ రాంగ్ అయింది. ఈడీ తమను ఇబ్బంది పెడుతోందంటూ ఫిబ్రవరిలో 13న జగన్ రాసిన లెటర్ ను మొన్ననే రాసిచ్చినట్లు చూపించటంతోపాటు, అదే నిజమన్నట్లు అచ్చోసింది. దీంతో కడుపు మండిన జగన్ పార్టీ సీరియస్ అయింది. ఆలెటర్ ప్రధానికి ఎప్పుడు రాసిందీ, అక్కడ్నుంచి వచ్చిన వివరాలనూ మీడియాకు చూపించింది. దీంతో అసలు వాస్తవమేంటో తెలుగు ప్రజలకు తెలిసిపోయింది. వేమూరివారి ఎల్లో జర్నలిజం బట్టబయలయింది.

ఈ సాక్ష్యాలను చూపెట్టి.. ఇకనుంచి ఇలాంటి దిక్కుమాలిన వార్తలు రాసే వేమూరి వారి మీడియాను తాము బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులను ఇకనుంచి తమ పార్టీ కార్యాయలంలోకి అడుగు పెట్టనిచ్చేదిలేదని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి తేల్చి చెప్పారు. ఈ క్షణం నుంచే ఆదేశాలు అమల్లోకి వస్తాయని కూడా ఆయన ప్రకటించారు. 

DO YOU LIKE THIS ARTICLE?