నిరుద్యోగ భార‌తం

45ఏళ్ల గరిష్ఠానికి చేరిన నిరుద్యోగ రేటు

న్యూఢిల్లీ: పార్ల‌మెంట్ ఎన్నికల ముందు ప్ర‌ధాని మోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2017-18 సంవత్సరంలో దేశంలో నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగి 45ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఈ మేరకు నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నివేదిక వెల్లడించినట్లు బిజినెస్ స్టాండ‌ర్డ్ మీడియా సంస్థ తెలిపింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ఈ నివేదికను అధికారికంగా విడుదల చేయనప్పటికీ ఇందులోని వివరాలను తమ వ‌ద్ద ఉన్నాయ‌ని కథనంలో ఉటంకించింది. దీంతో ఇది కాస్తా రాజకీయ వివాదానికి తెరతీసింది. 2017 జులై నుంచి 2018 జూన్‌ మధ్య దేశంలో నిరుద్యోగ రేటు 6.1శాతంగా నమోదైందని ఎన్‌ఎస్‌ఓస్‌ఓ నివేదిక వెల్లడించినట్లు ఆ కథనం పేర్కొంది. 1972-73 తర్వాత నిరుద్యోగ రేటు ఈ స్థాయిలో ఉండటం మళ్లీ ఇప్పుడే. పట్టణ ప్రాంతంలో నిరుద్యోగం 7.8శాతంగా ఉండగా.. గ్రామాల్లో 5.3శాతంగా నమోదైనట్లు నివేదికలో పేర్కొన్నారు. కాగా.. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నిరుద్యోగులపై ఎన్‌ఎస్ఎస్‌ఓ సర్వే చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

DO YOU LIKE THIS ARTICLE?