చైనా బాటలో తెలంగాణ

కరోనా నిర్మూలనకు గచ్చిబౌలిలో ప్రత్యేక ఆసుపత్రి
1500 పడకలతో  చికిత్స అందించేందుకు ఏర్పాటు
గచ్చిబౌలిలోని స్పోర్ట్‌ భవనం ప్రత్యేక కరోనా సెంటర్‌గా మార్పు
కొవిడ్‌-19 ఆసుపత్రులుగా మరో 22 మెడికల్‌ కాలేజీలు సిద్ధం
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు కెటిఆర్‌, ఈటల రాజేందర్‌

ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ సోకిన బాధితులకు చికిత్స అందించేందుకు వూహాన్‌లో చైనా దేశం 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించిన విష యం తెలిసిందే. రాబోవు విపత్తును ముందస్తుగానే ఊహించి ఎన్నో చర్యలు తీసుకోవడం వల్లే ఆదేశంలో కరోనా అదుపులోకి వచ్చింది. చైనా తరహాలోనే తెలంగాణ కూడా ఓ ప్రత్యేకమైన భవనాన్ని కరోనా రోగుల చికిత్స కోసం యుద్ధప్రాతిపదికన 1500 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని స్పోర్ట్‌ సెంటర్‌ భవనాన్ని ప్రత్యేకంగా కరోనా ఆసుపత్రిగా మార్చారు. రాష్ట్రంలో వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగితే ఆలస్యం కాకుండా సత్వరమే చికిత్స అందిచేందుకు ముందు జాగ్రత్త చర్యగా  దీన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య సోమవారం వరకు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటన్‌ ప్రకారం 364 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పడకల కొరత ఉండకుండా ఈ తరహా ఏర్పాట్లను ప్రభుత్వం చేపడుతోంది.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8 కరోనా సెంటర్లు బాధితులకు చికిత్సను అందిస్తున్నాయి. దీంతోపాటు రాష్ట్రంలోని మరో 22 మెడికల్‌ కాలేజీ హాస్పిటళ్లను కూడా పూర్తిగా కరోనా చికిత్స కోసం మార్చుతున్నారు. అయితే ఈ పనులను మంత్రులు కెటిఆర్‌, ఈటల రాజేందర్‌ ఇతర వైద్యాధికారులు, ఉన్నతాధికారులు మంగళవారం సందర్శించారు. వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో పెరిగే అవకాశమున్న నేపథ్యంలో వీటిని వినియోగించనున్నారు. మొదట గచ్చిబౌలిలో ఏర్పాటు చేస్తున్న కరోనా ఆసుపత్రిని మంత్రులు సందర్శించి వైద్య సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొయినాబాద్‌లోని భాస్కర్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిని మంత్రులు  సందర్శించి ఆసుపత్రుల్లోని అన్ని వార్డులను తనిఖీ చేశారు.
గచ్చిబౌలిలో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు 1500 పడకల  ఆసుపత్రి సిద్ధంగా ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం, సిఎం కెసిఆర్‌ నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 1500 పడకల కొవిడ్‌ ఆసుపత్రి సిద్దమైపోయిందని మంత్రులు కెటిఆర్‌, ఈటల ట్వీట్‌ చేశారు.
కరోనాను తరిమి కొట్టడంలో ప్రభుత్వ నిబద్ధత ఈ చర్యలను చూస్తేనే అర్థమవుతోందని మంత్రి ఈటల ట్వీట్‌ చేశారు. దీంతో పాటు 22 మెడికల్‌ కాలేజీలను కూడా కొవిడ్‌ ఆసుపత్రులుగా మార్చుతున్నట్లు వెల్లడించారు.

DO YOU LIKE THIS ARTICLE?