టీమిండియా రికార్డుల వెల్లువ

సిడ్నీ: భారత క్రికెట్‌ జట్టు భారత టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి తన సత్తాను క్రికెట్‌ ప్రపంచానికి చాటింది. ఆస్ట్రేలియాలో తొలి సిరీస్‌ విజయాన్ని నమోదు చేసి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. ఈ విజయంతో భారత అభిమానుల చిరకాల స్వప్నం నెరవేరింది. నాలుగో టెస్టు ఐదో రోజు ఆట వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్‌ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ విజయంతో భారత్‌ మరికొన్ని మైలురాళ్లను చేరుకుంది. జట్టుగా భారత్‌ కొన్ని రికార్డులు నెలకొల్పగా, వ్యక్తిగతంగా కోహ్లీ కూడా పలు రికార్డులు సృష్టించాడు.
* 72 ఏళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై భారత్‌కు తొలి సిరీస్‌ విజయమిది. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్‌ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో భారత్‌కు 7 విజయాలు దక్కాయి.
* ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీనే.
* SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో భారత్‌ సిరీస్‌ విజయాలను నమోదు చేసింది.
1967/68లో న్యూజిల్యాండ్‌లో 3-1 తేడాతో
1971లో ఇంగ్లాండ్‌లో 1-0 తేడాతో
1986లో ఇంగ్లాండ్‌లో 2-0 తేడాతో
2007లో ఇంగ్లాండ్‌లో 1-0 తేడాతో
2008-09లో న్యూజిలాండ్‌లో 1-0 తేడాతో
2018-19లో ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో భారత్‌ సిరీస్‌ విజయాలను సొంతం చేసుకుంది.

* విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో విదేశీ గడ్డపై సిరీస్‌ విజయాలు..
2015లో శ్రీలంకలో 2-1 తేడాతో
2016లో వెస్టిండీస్‌లో 2-0 తేడాతో
2017లో శ్రీలంకలో 3-0తేడాతో
2018-19 ఆస్ట్రేలియాలో 2-1 తేడాతో
* ఆస్ట్రేలియాలో పర్యాటక జట్లు నమోదు చేసిన సిరీస్‌ విజయాలు : ఇంగ్లాండ్‌ రికార్డు స్థాయిలో 13 సార్లు ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ విజయాలు నమోదు చేయగా.. విండీస్‌ నాలుగు సార్లు గెలుపొందింది. దక్షిణాఫ్రికా మూడు సార్లు, న్యూజిలాండ్‌, భారత్‌ ఒక్కోసారి సిరీస్‌ విజయాలను నమోదు చేశాయి.

ఘనత వహించిన కోహ్లీ
ఆస్ట్రేలియాతో వారి దేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో భారత్‌ తరపున ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన విరాట్‌ కోహ్లీ…. మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా కూడా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాలో సిరీస్‌ సాధించిన విదేశీ జట్ల జాబితాలో ఇప్పటివరకూ ఏ ఒక్క ఆసియా జట్టు కూడా లేదు. అంతకుముందు ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాలు మాత్రమే ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించి సిరీస్‌ సాధించాయి. ఇందులో ఇంగ్లాండ్‌ 13 సార్లు సిరీస్‌ సాధించగా, విండీస్‌ నాలుగు సందర్భాల్లో సిరీస్‌లు సాధించింది. ఇక దక్షిణాఫ్రికా మూడు సార్లు, న్యూజిలాండ్‌లు ఒకసారి ఆసీస్‌ను వారి దేశంలో ఓడించి సిరీస్‌ హస్తగతం చేసుకున్నాయి.
మరొకవైపు కెప్టెన్‌గా విరాట కోహ్లీకి ఇది విదేశాల్లో నాల్గో సిరీస్‌ విజయం. 2015లో శ్రీలంకలో 2-1తో సిరీస్‌ గెలిచిన విరాట్‌ సేన.. 2016లో వెస్టిండీస్‌లో 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. 2017లో మరొకసారి శ్రీలంకపై సిరీస్‌ను కైవసం చేసుకుంది కోహ్లీబృందం. ఆ సిరీస్‌ను భారత్‌ 3-0తో సాధించింది. ఆపై ఆసీస్‌ను వారి గడ్డపైనే ఓడించి సిరీస్‌ను సాధించడంతో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో 146 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. ఆపై మెల్‌ బోర్న్‌ టెస్ట్‌లో 137 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగియడంతో సిరీస్‌ భారత్‌ సొంతమైంది. ఈ సిరీస్‌లో ఛటేశ్వర్‌ పుజారా 521 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, బౌలింగ్‌ విభాగంలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహ్మద్‌ షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు తీశారు. రిషబ్‌ పంత్‌ కూడా ఒక సెంచరీ చేయగా, మయాంక్‌ అగర్వాల్‌ అరంగేట్రం చేశాడు.

DO YOU LIKE THIS ARTICLE?