రాజస్థాన్ సిఎంగా గెహ్లాట్‌

సచిన్‌ పైలట్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి
తేలని ఛత్తీస్‌గఢ్ సిఎం..

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఎఐసిసి పరిశీలకుడు కెసి వేణుగోపాల్ శుక్ర‌వారం ప్రకటించారు. ఉపముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. రాజస్థాన్ సిఎం పదవికి గెహ్లాట్‌తో పాటు యువ నేత సచిన్‌ పైలట్‌ కూడా పోటీపడ్డారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై పార్టీ గత మూడు రోజులుగా తర్జనభర్జన పడింది. రాష్ట్రానికి వెళ్లిన ఎఐసిసి పరిశీలకుడు వేణుగోపాల్‌ సహా ఇతర సీనియర్‌ నేతలతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురువారం నుంచి విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. అటు గెహ్లాట్‌, పైలట్‌లతోనూ పలు దఫాలుగా మాట్లాడారు. శుక్ర‌వారం మరోసారి చర్చలు జరిపిన అనంతరం గెహ్లాట్‌ పేరును ఖరారు చేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కూడా పైలట్‌ కొనసాగనున్నారు.
మరోవైపు ఛత్తీస్‌గఢ్ ముఖ్య‌మంత్రి ఎంపికపై మాత్రం అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పదవి కోసం టిఎస్‌ సింగ్‌దేవ్‌, భూపేశ్‌ పటేల్‌ పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై త్వరలోనే పార్టీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?