అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి : మోడీకి రాజా లేఖ

ప్రజాపక్షం/న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ ప్రభావం, లాక్‌డౌన్‌ కారణంగా ప్రజల కగుర్తింపు పొందిన అన్ని జాతీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సోమవారంనాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోడీకి ఒక లేఖ రాశారు. “నేడు భారతదేశం తీవ్రమైన ఆర్థిక విపత్తును ఎదుర్కొంటున్నది. మహమ్మారి కొవిడ్‌ 19కు వ్యతిరేకంగా ప్రజలంతా సమైక్యంగా పోరాడుతున్నారు. ప్రభుత్వం, రాజకీయ పార్టీలతోపాటు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉన్న వారంతా ఈ విపత్తుకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసి నడవాల్సిన తరుణం ఆసన్నమైంది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, నిపుణులతో మీరు మాట్లాడుతున్నారు. పార్లమెంటులో రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతోనూ చర్చించాలని నిర్ణయించారు. అయితే సాంకేతికంగా కొన్ని పార్టీలకు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. బడ్జెట్‌ సమావేశాల వాయిదా పడిన చివరి రోజుల్లోనే ఈ చర్చ జరిపి వుండాల్సింది. అందుకే గుర్తింపు పొందిన అన్ని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత దేశ పరిస్థితిపై సంప్రదింపులు జరపాలని సిపిఐ కోరుతున్నది” అని రాజా ఆ లేఖలో మోడీకి విజ్ఞప్తి చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?