అత‌లాకుత‌లం

పెథాయ్‌ ప్రభావంతో స్తంభించిన రవాణా వ్యవస్థ

కాకినాడ‌: పెథాయ్ తుపాను ప్ర‌భావంతో దక్షిణ కోస్తా నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజుల నుంచే ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన తుపాను సోమ‌వారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో కాకినాడ-యానాం వద్ద తీరం దాటింది. దీంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. కొన్ని చోట్ల బస్సులు, రైళ్లు, విమానాలను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. కొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలు, గాలుల తాకిడికి పలుచోట్ల సెల్‌టవర్లు పనిచేయడం లేదు. సమాచార వ్యవస్థను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పెథాయ్‌ తుపాను ధాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో రోడ్లపై చెట్లు కూలిపోయాయి. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతంలో రోడ్లపై కూలిన చెట్లను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నర్సీపట్నం జంక్ష‌న్‌ వద్ద చెట్లు కూలడంతో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి ప్రజాజీవనానికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. అనకాపల్లి – తుని మధ్య రాకపోకలపై ఆంక్షలు పెట్టినట్టు విశాఖ జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. అయితే విశాఖ‌ప‌ట్నం నుంచి వివిధ‌ ప్రాంతాల‌కు వెళ్లే రైళ్ల‌ను ర‌ద్దు చేశారు. మొత్తంగా 47 ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను, 5 ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌ను ర‌దు్ద చేశారు. అలాగే విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విశాఖకు రావాల్సిన మొత్తం 14 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దాదాపు 750 మందికి పైగా ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఉండిపోయారు. వీరికి ఆయా విమానయాన సంస్థలు మంచినీరు, ఆహార ఏర్పాట్లు చేశాయి. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొన్ని విమానాలను హైదరాబాద్‌కు మళ్లించారు.

DO YOU LIKE THIS ARTICLE?