మాస్క్‌ మస్ట్‌

ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
కరోనా సోకినా వ్యాధి లక్షణాలు ఉండట్లేదని నిర్ణయం

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి విజృంభిస్తుండటంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి ఇక బయటికొస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా వ్యాధి లక్షణాలు ఉండట్లేదని ఆధ్యయనంలో తేలడంతో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మాస్కులు లేకుండా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేయడాన్ని తెలంగాణ ప్రభు త్వం ఇప్పటికే  నిషేధించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తాజాగా మాస్కుల వినియోగాన్ని కూడా తప్పనిసరి చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దగ్గడం, తుమ్మడం, మాట్లాడే సమయాల్లో వెలువడే తుంపర్లు అవతలి వ్యక్తులపై పడి కరోనా బారినపడే అవకాశం ఉంది. దీన్ని నివారించేందుకు మాస్కుల వినియోగం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నది. రెండు పొరలుగా ఉండే కాటన్‌తో చేసిన మాస్కుల వినియోగం ఆమోదయోగ్యంగా పేర్కొంది. ముక్కు, నోరు, గదవను కవర్‌ చేసే విధంగా మాస్కులు ఉండాలంది. అదేవిధంగా మాస్కుకు, ముఖానికి ఖాళీ ఉండొద్దని తెలిపింది. విధుల్లో ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. ఇప్పటి వరకూ వైద్య సిబ్బంది, పోలీసులు, అనార్యోగంతో ఉన్న వారు మాత్రమే మాస్కులు వాడుతున్నారు. కానీ ఇక నుంచి ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు వాడటాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సైంటిఫిక్‌ అధ్యయనం ప్రకారం మాస్కుల వినియోగంతో జపాన్‌లో కరోనా కేసుల వ్యాప్తి తగ్గినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో గురువారం మధ్యాహ్నం వరకు 471 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు 130 హాట్‌ స్పాట్‌లను గుర్తించారు. హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లోని వ్యక్తులు ఎవరూ కూడా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. క్లస్టర్‌ జోన్స్‌లో భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరినీ లోనికి అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే ఢిల్లీలో మాస్కులు తప్పని సరిచేసిన విషయం తెలిసిందే. మాస్కులేకుండా ఎవరైనా అక్కడ బటికి వస్తే రూ.200 నుంచి రూ.500 వరకు దశల వారిగా జరిమానాను విధిస్తున్నారు. అలాగే ముంబై నగరపాలక సంస్థతోపాటు యూపి, జమ్మూకాశ్మీర్‌, లడఖ్‌ ప్రభుత్వాలు బయటకు వచ్చే వాళ్లు ఖచ్చితంగా ఫేస్‌ మాస్కులు ధరించాలని ప్రజలను ఇప్పటికే ఆదేశించాయి.
మాస్క్‌లు ఇలా వాడాలి
ప్రభుత్వం మార్గదర్శకాలు
మాస్కులను ఎలా వినియోగించాలో కొన్ని మార్గనిర్ధేశకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంట్లో తయారు చేసుకున్న మాస్కులను కూడా వాడొచ్చని తెలిపింది. *ముఖం, ముక్కు, నోరు, గదుమ కవర్‌ చేసేలా మాస్కులను ధరించాలని పేర్కొన్నది.
*అన్ని కార్యాలయాలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మాస్కులను ధరించేలా ప్రోత్సహించాలి.
*గ్రామీణా ప్రాంతాలో పనిచేసే చోట, పబ్లిక్‌ స్థలాల్లో కూడా మాస్కులను తప్పకుండా ధరించాలి.
* మాస్కును ధరించే ముందు చేతులు శుభ్రంగా సబ్బు లేదా శానిటైజర్‌తో కడుక్కోని ధరించాలి.
* ఒక సారి ఉపయోగించిన మాస్కును మళ్లీ వాడకూడదు. వాడిన మాస్కును మూత ఉన్న డస్ట్‌ బిన్‌లో పారేయాలి.
*రెండు వైపుల మాస్కును ఉపయోగించకూడదు. క్లాత్‌తో తయారు చేసిన రీయూజబుల్‌ మాస్కులను వాడితే ఉత్తమం.
* ఒక మాస్కును కేవలం ఆరుగంటలు మాత్రమే వాడాలి.
* మాస్కును తీసే క్రమంలో మాస్కు ముందలి భాగంలో కానీ ఇతర ప్రదేశంలో తాకకుండా జాగ్రత్తగా తీయాలి.
* తీసిన వెంటనే సబ్బు లేదా శానిటైజర్‌తో 40 సెకండ్ల పాటు కడుక్కోవాలి.
* తిరిగి ఉపయోగించుకునే మాస్కులను వేడి నీళ్లతో గానీ సబ్బుతో శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు.
* సబ్బుతో/డెటాల్‌తో ఉతికిన తరువాత ఎండలో కనీసం 5 గంటల పాటు ఎండబెట్టాలి.
* లేదా మరిగిన వేడి నీళ్లలో మాస్కును 15 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టుకొని 5 నిమిషాలు ఐరన్‌ చేసుకోని వాడుకోవాలి.
* ముఖానికి, కళ్లకు చేతులతో తాకకుండా జాగ్రత్త పడాలి.
* మనిషికి మనిషికి మధ్య 2 మీటర్ల సామాజిక దూరం పాటించాలి.

DO YOU LIKE THIS ARTICLE?