అట్టుడికిపోతున్న కశ్మీర్‌ లోయ

ఆరుగురు పౌరులు మృతి

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయ మరోసారి అల్లర్లతో అట్టుడికిపోతోంది. పుల్వామా జిల్లాలో శ‌నివారం ఉదయం భద్రతాసిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాసిబ్బంది మట్టుబెట్టారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. వీరిని అడ్డుకునేందుకు భద్రతాసిబ్బంది కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా జిల్లాలోని సిర్నో గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భద్రతాసిబ్బంది కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు సిబ్బందిపైకి కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు జరిపిన భద్రతాసిబ్బంది ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను కూడా అమరుడయ్యారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం స్థానిక యువకులు భద్రతాసిబ్బందికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు పెల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. పౌరుల మృతితో సమీప గ్రామాల్లోనూ ఆందోళనలు చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పుల్వామాలో ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

DO YOU LIKE THIS ARTICLE?