2021 డిసెంబరు నాటికి గగన్‌యాన్‌

వ్యోమోగాముల్లో మహిళ కూడా..
ఇస్రో ఛైర్మన్‌ శివన్ వెల్ల‌డి

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 2021 డిసెంబరు నాటికి భారత్‌ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు ఇస్రో ఛైర్మన్‌‌ కె.శివన్‌ శుక్రవారం వెల్లడించారు. గగన్‌యాన్‌ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వతంత్రంగా మనుషులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్‌ ఘనత దక్కించుకోనుంది. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ గగన్‌యాన్‌ ప్రాజెక్టుపై ప్రకటన చేశారు. 2022నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళిక వేస్తున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు శివన్‌ 2021 డిసెంబరు నాటికే పంపాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పంపే వ్యోమగాములకు తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో శిక్షణ ఇప్పిస్తామ‌ని తెలిపారు. ఈ బృందంలో మహిళ కూడా ఉంటార‌ని, ఇది మా లక్ష్యమ‌ని శివన్‌ తెలిపారు. ముగ్గురు వ్యోమగాములను వారం పాటు అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రష్యా, ఫ్రాన్స్‌లతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యోమగాముల బృందం పూర్తిగా పురుషులతో కూడుకున్నది కాదని.. ఆ బృందంలో ఓ మహిళ కూడా ఉంటారని ఆయన తెలిపారు.
అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రుడిపైకి ‘చంద్రయాన్‌-2’ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శివన్‌ వెల్లడించారు. ఇస్రో తొలుత ‘చంద్రయాన్‌-2’ను జనవరి నుంచి ఫిబ్రవరి 16 మధ్యలో చేపడతామని తెలిపింది. అయితే కొన్ని పరీక్షలు పూర్తికాకపోవడం వల్ల తేదీని మార్చారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ చివరి నాటికి ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతున్నామని నేడు శివన్‌ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?