ఎంపీలాడ్స్‌పై రెండేళ్ల నిషేధం సరికాదు : సిపిఐ

ప్రజాపక్షం/న్యూఢిల్లీ : ఎంపిలాడ్స్‌ నిధులపై రెండేళ్లపాటు నిషేధం విధించాలని కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ తప్పుబట్టింది. ఎంపిలాడ్స్‌ నిధులకు సంబంధించి కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని సిపిఐ అభిప్రాయపడింది. ఈ మేరకు మంగళవారంనాడు పార్టీ జాతీయ కార్యదర్శివర్గం ఒక ప్రకటన విడుదల చేసిం ది. ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించాలన్న నిర్ణయంతో సిపిఐ ఏకీభవించింది. తమ పార్టీలకు ఇద్దరు లోక్‌సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ వున్నారని, వారు ఇదివరకే ఒక నెల జీతాన్ని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాల సిఎం రిలీఫ్‌ ఫండ్స్‌కు విరాళంగా అందజేశారని వెల్లడించింది. అయితే ఎంపీలాడ్స్‌ విషయంలో తమ అభ్యంతరాన్ని సిపిఐ తెలిపింది. రెండేళ్లపాటు ఎంపీలాడ్స్‌ నిధులపై నిషేధం విధించడం కన్నా ఆ నిధులను ప్రస్తుత కొవిడ్‌ 19 సంక్షోభ కాలంలో ఆయా రాష్ట్రాలు, నియోజకవర్గాలో ప్రజారోగ్యంపై మాత్రమే ఖర్చుచేయాలని ఎంపీలకు సలహాఇచ్చి వుంటే బాగుండేదని, దాని వల్ల దేశంలో ప్రజారోగ్య సదుపాయాలు మెరుగుపడటానికి దోహదపడుతుందని సిపిఐ తెలిపింది. ఆదాయ సమీకరణకు సంబంధించినంత వరకు ప్రజల ఈతిబాధలను తీర్చడంలో కార్పొరేట్‌, బడా వ్యాపార సంస్థల పాత్ర ఏమేరకు వుందో ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలని హితవు పలికింది. చాలా మార్గాల్లో ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్‌ సంస్థలకు ఎంతో సహాయపడుతోందని గుర్తు చేసింది. నరేంద్ర మోడీ ప్రధామంత్రిగా బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014-15 నుంచి ఇప్పటివరకు కార్పొరేట్‌ ఆదాయపన్ను ద్వారా ప్రభుత్వానికి జరిగిన నష్టం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు వుంటుందని సిపిఐ అంచనా వేసింది. ఏప్రిల్‌ 8వ తేదీన పార్లమెంటు ఫ్లోర్‌లీడర్లతో జరిగే సమావేశం అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకొని వుండాల్సిందని, ఒక సమావేశం వుంటుందని ప్రకటించిన తర్వాత, ఏకపక్షంగా ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడమనేది న్యాయబద్ధం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకరమైన పరిణామం కాబోదని వ్యాఖ్యానించింది.

DO YOU LIKE THIS ARTICLE?