కరోనా బారిన 23 రోజుల పసికందు

మహబూబ్‌నగర్‌లో బయటపడ్డ కేసు
నిజామాబాద్‌లో కొత్తగా 10 కేసులు నమోదు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కడపటి వార్తలు అందేసరికి మంగళవారంనాడు కొత్తగా 40 కేసులు నమోదయ్యా యి. ఇందులో మహబూబ్‌నగర్‌లో మూడు కేసులు, నిజామాబాద్‌లో పది కేసులు వున్నా యి. పైగా మహబూబ్‌నగర్‌లో 23 రోజుల పసికందుకు మహమ్మారి కరోనావైరస్‌ సోకిం ది. ఈ విషయాన్ని ఆ జిల్లా కలెక్టర్‌ ధృవీకరించారు. మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఈ కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనా వైరస్‌ సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్రితం పసికందు తండ్రితో పాటు నాయనమ్మకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. తాజాగా ఆ కుటుంబంలో చిన్నారికి వైరస్‌ సోకింది. మెరుగైన చికిత్స కోసం పసికందును సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి నుంచే తాజాగా ఈ ముగ్గురికి వైరస్‌ సోకినట్లు తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు కాగా ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారు. మరోవైపు తాజాగా ముగ్గురికి కరోనా సోకడంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది అన్వేషణ మొదలు పెట్టింది. ఇదిలావుండగా, నిజామాబాద్‌ జిల్లాలో మరో 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 39కి చేరింది. కరోనాపై నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో మంత్రి వివరాలు వెల్లడించారు. వీటిలో నిజామాబాద్‌ నగరంలో 21 కేసులు, ఇతర ప్రాంతాల్లో 18 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. అయితే విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 3,800 మందిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని మంత్రి స్పష్టం చేశా రు. కేవలం ఢిల్లీ మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలోనే కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని చెప్పా రు. జిల్లాలో ఇంకా 109 నమూనాల నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల ఆధారంగా కరోనా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా తీసుకుని చర్యలు చేపడుతున్నామని.. ఇప్పటివరకు జిల్లాలో 4 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రెండు రోజులకు ఒకసారి ప్రతి ఇంటిని సర్వే చేసేలా అధికారులను ఆదేశించినట్లు మంత్రి వేముల వెల్లడించారు. ఈ 13 కేసులతో కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 404కి చేరింది. ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇతర జిల్లాల నుంచి కరోనాకు సంబంధించి తాజా కేసుల వివరాలు ఇంకా అందాల్సివుంది.

DO YOU LIKE THIS ARTICLE?