40 కోట్ల మంది పేదరికంలోకి!

కరోనా కొట్టిన దెబ్బకు భారత అసంఘటిత రంగం విలవిల
ప్రపంచవ్యాప్తంగా 19.50 కోట్ల ఉద్యోగాలు గల్లంతు
ప్రతి ఐదుగురిలో నలుగురి ఉపాధి మటాష్‌
అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక వెల్లడి

న్యూయార్క్‌ : అసలే అది సంఘటితర రంగం. రెక్కాడితే గాని డొక్కాడని జనం. పని ఉంటే రోజుకు కనీసం రూ. 200 నుంచి రూ. 500 వరకు సంపాదించుకునే కార్మికులు వాళ్లు. అత్యధికులు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లి వలస జీవనం సాగించేవారే. రోజుకూలీతో బతుకీడ్చే ఈ రంగ కార్మికులు ఉన్నట్టుండి రోడ్డునపడ్డారు. కరోనా కొట్టిన దెబ్బకు ఒక్కసారిగా చేతిలో పని జారిపోయింది. లాక్‌డౌన్‌తో పనికేంద్రాలు మూసివేశారు. ఒక్క షాపు కూడా లేదు, భవన నిర్మాణాల్లేవు, వర్క్‌షాపుల్లేవు, ఏ ఒక్క రవాణా వ్యవస్థ పనిచేయడం లేదు, అభివృద్ధి పనులూ ఆగిపోయాయి, వినోదరంగమూ స్తంభించింది…ఇలా అసంఘటితరంగ కార్మికులు పనిచేసే అన్ని వ్యవస్థలూ నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా మన దేశంలో కోట్లాది మంది కార్మికులు పనుల్లేక ఇంటిపట్టునే ఉండిపోతున్నారు లేదా సొంతూరుకు వలసబాట పడుతున్నారు. పోలీసులు వారిని ఆపి ఆపి లాఠీలతో కొట్టినా, శానిటైజర్‌ క్యాన్లుతో పిచికారీలు చేసినా, గడిచిన 20 రోజులుగా వారు రోడ్డునపడి నడుస్తూనే వున్నారు. రేషన్‌ కార్డు ఉన్నవారికి 12 కిలోల బియ్యం, రూ. 1500 రూపాయలు ఇచ్చినా, కార్డు లేనివారికి 6 కిలోల బియ్యం, రూ. 500 ఇచ్చినా…అది పూర్తిగా కడుపు నింపలేకపోయింది. తెలంగాణలో ఈ మాత్రమైనా సాయముంది. ఇతర రాష్ట్రాల్లో ఆ సాయం మరింత తక్కువ. ఎక్కువ రాష్ట్రాల్లో వలస కార్మికులను పట్టించుకునే నాథుడే లేడు. కరోనా నేపథ్యంలో అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవడంలో కేంద్రప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. దాదాపు వారందరి పరిస్థితి దయనీయంగా మారబోతున్నది.
ఈ నేపథ్యంలో భారత అసంఘటిత రంగంపై కొవిడ్‌-19 తీవ్ర ప్రభావం చూపనుందని తాజాగా ఐక్య రాజ్య సమితి (ఐరాస) అభిప్రాయపడింది. ఈ రంగంలో దారిద్య్రం ప్రమాదకర స్థాయిలో ముంచుకొస్తున్నదని హెచ్చరించింది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న దాదాపు 40 కోట్ల మంది మరింత పేదరికంలోకి జారుకోనున్నారని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19.50కోట్ల ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని లెక్కగట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) సెకెండ్‌ ఎడిషన్‌ ‘ఐఎల్‌ఓ మానిటర్‌ : కొవిడ్‌-19 అండ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌’ పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన అతిపెద్ద సంక్షోభంగా ఈ నివేదిక అభివర్ణించింది. ఈ దుస్థితి కరోనా మహమ్మారి పుణ్యమేనని పేర్కొంది. వసతి, ఆహారం, ఉత్పత్తి, రిటైల్‌,  వ్యాపార, పాలనా రంగాలపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ప్రతి ఐదుగురిలో నలుగురు ప్రభావితమయ్యారని తేల్చింది. భారత్‌తోపాటు నైజీరియా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో లాక్‌డౌన్‌ ఈ అసంఘటిత రంగాన్ని కుప్పకూల్చిందని ఐఎల్‌ఓ తెలిపింది. భారత్‌లో పనిచేసే వారిలో దాదాపు 90 శాతం మంది అసంఘటిత రంగంలోనే వున్నారు. వారిలో సరాసరి 400 మిలియన్ల మంది అంటే 40 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఐఎల్‌ఓ తెలిపింది. భారత్‌లో ప్రస్తుత లాక్‌డౌన్‌ చర్యలు తప్పనిసరి కావచ్చని, కాకపోతే అసంఘటిత రంగ కార్మికులను ఎన్నడూ లేనిస్థాయిలో కుదేలును చేసిందని యూనివర్శిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ విడుదల చేసిన గవర్నమెంట్‌ రెస్పాన్స్‌ స్ట్రింజెన్సీ ఇండెక్స్‌ పేర్కొందని ఐఎల్‌ఓ ఉటంకించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికం ముగిసే సమయానికి కరోనా ప్రభావం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 6.7 శాతం పనిగంటలు తుడిచిపెట్టుకుపోతాయని, అంటే 19.50 కోట్ల మంది కార్మికులు రోడ్డున పడతారని ఆ నివేదిక వెల్లడించింది. ఇక పెద్దగా నష్టపోయేది ఇండియానే అని, అరబ్‌ స్టేట్స్‌లో 50 లక్షల మంది ఫుల్‌టైమ్‌ ఉద్యోగులు, ఐరోపాలో 1.2 కోట్ల మంది ఫుల్‌టైమ్‌ ఉద్యోగులు, అలాగే ఆసియా, ఫసిఫిక్‌ ప్రాంతంలో 12.5 కోట్లమంది ఫుల్‌టైమ్‌ కార్మికుల ఆకలికేకలను మనం వినబోతున్నామని ఆ నివేదిక హెచ్చరించింది.
ఈ కష్టకాలంలో వేగంగా, సరైన రీతిలో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయించనున్నాయని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గై రైడర్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని వారందరి ఉపాధి ప్రమాదపుటంచులకు చేరిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పరిస్థితులు మరింత దయనీయంగా మారనున్నాయని అంచనా వేసింది. ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ భారత్‌లో రోజుకూలీలపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రస్తావించింది. వారంతా స్వస్థలాలకు వలస వెళ్లిపోతున్న ఉదంతాన్ని గుర్తుచేసింది. గత 75 ఏళ్ల చరిత్రలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంతటి సంక్షోభ పరిస్థితుల్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని ఐఎల్‌ఓ స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారంతోనే ఈ సంకట స్థితి నుంచి బయటకపడగలమని సూచించింది. ముఖ్యంగా కరోనా వల్ల అత్యంత భారీగా ప్రభావితమైన దేశాలకు అందరూ అండగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తామని వ్యాఖ్యానించింది. సరైన చర్యల ద్వారా ఈ సంక్షోభం మిగిల్చబోయే చేదు అనుభవాల్ని కొంతమేర తగ్గించొచ్చని అభిప్రాయపడింది.

DO YOU LIKE THIS ARTICLE?