9 రాష్ట్రాలు 72 స్థానాలు

నేడే 4వ విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌

న్యూఢిల్లీ: లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల్లో తొమ్మిది రాష్ట్రాలో 72 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడత ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలు ఎక్కువ సీట్లు గెలిచేందుకు పోటీపడుతున్నాయి. 2014లో ఈ సీట్లకు జరిగిన ఎన్నికల్లో బిజెపి 56 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ రెండు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆరు, బిజూ జనతాదల్‌ ఆరు సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్రలో 17, రాజస్థాన్‌లో 13, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమబెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, ఒడిశాలో 6, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3, అనంత్‌నాగ్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన కుల్గాం జిల్లాలో పోలింగ్‌ జరగనుంది. తొలి మూడు విడతల్లో 302 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. తదుపరి మిగిలిన మూడు దశల ఎన్నికల్లో 168 సీట్లకు పోలింగ్‌ జరగనుంది. నాలుగో విడత ఎన్నికల్లో కేంద్ర మంత్రులు గిరిరాజ్‌ సింగ్‌, సుభాష్‌ భమ్రే, ఎస్‌ఎస్‌ అహుల్‌వాలియా, బాబుల్‌ సుప్రీయో(బిజెపి), మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్‌ ఖుర్షీద్‌, అధిర్‌ రంజన్‌ చౌదరి, సహా 961 అభ్యర్థుల భవిత ఏమిటో తేలనుంది. నాలుగో విడత ఎన్నికల్లో దాదాపు 12.79 కోట్ల మంది ఓటర్లు వీరి తలరాతలను నిర్ణయించబోతున్నారు. పోటీపడుతున్న కీలక అభ్యర్థుల్లో కన్హయ్య కుమార్‌(సిపిఐ), బైజయంత్‌ పాండ(బిజెపి), ఉర్మిళా మతోంద్కర్‌ (కాంగ్రెస్‌), డింపుల్‌ యాదవ్‌(సమాజ్‌వాదీ  పార్టీ), శతాబ్ది రాయ్‌(టిఎంసి), మిలింద్‌ దేవడ(కాంగ్రెస్‌) ఉన్నారు. నాలుగో విడత ఎన్నికలకు ఎన్నికల సంఘం 1.40 లక్షల పోలింగ్‌ స్టేషన్లు నెలకొల్పింది. అనేక భద్రతా ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్రలో మాత్రం ఈ విడతతో లోక్‌సభ ఎన్నికలు ముగియనున్నాయి. మహారాష్ట్ర ఉత్తరాదిన, ముంబయిలో తాను కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు కాంగ్రెస్‌ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. కాగా నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ థానే జిల్లాలో, మహారాష్ట్ర పశ్చిమాన తన కాలూనేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షం శివసేన మొత్తం 17 సీట్లు గెలుచుకున్నాయి. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కుమారుడు, ఇద్దరు కేంద్ర మంత్రులు సహా 115 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అశోక్‌ గెహ్లాట్‌ తన కుమారుడు వైభవ్‌ కోసం జోధ్‌పూర్‌లో విస్తృతంగా ప్రచారం చేసినందున ఈ సీటుపై అందరి దృష్టి ఉంది. వైభవ్‌ సిట్టింగ్‌ ఎంపి, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌తో తలపడుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బిజెపి రాజస్థాన్‌లో మొత్తం సీట్లు గెలుచుకుంది. కాగా ఈ మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పరాజయాన్ని చూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని 13 సీట్లకు బిజెపి, ఎస్‌పి-బిఎస్‌పి కూటమి మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. అయితే కన్నూజ్‌ నియోజకవర్గం మాత్రం సమాజ్‌వాదీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా ఉంది. 2014లో యుపిలోని 13 సీట్లలో బిజెపి 12 సీట్లు గెలుచుకోగా ఒక్క కన్నూజ్‌లో మాత్రం ఎస్‌పి మోడీ ప్రభంజనాన్ని నివారించింది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ మరోసారి కన్నూజ్‌ నుంచి ఎన్నిక కావడానికి ఉత్సాహపడుతున్నారు. కాగా యుపిలోని మూడు సీట్లలో కాంగ్రెస్‌ గట్టి పోటీనిస్తోంది. ఉన్నావ్‌లో అన్నూ టండన్‌, ఫరూఖాబాద్‌లో సల్మాన్‌ ఖుర్షీద్‌, కాన్పూర్‌లో శ్రీప్రకావ్‌ జైస్వాల్‌ కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీనిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ నాలుగు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో చతురుఖ పోటీ ఉంది. తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి, కాంగ్రెస్‌, లెఫ్ట్‌ ఫ్రంట్‌ పోటీపడుతున్నాయి. ఒడిశాలో 2014లో జరిగిన ఎన్నికల్లో బిజెడి మొత్తం అన్ని సీట్లు గెలుచుకుంది. కాగా ఈసారి బిజెపి కొన్ని సీట్లయినా అక్కడ గెలుచుకోవాలని చూస్తోంది. కేంద్రపాడ నుంచి బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌ పాండ పోటీపడుతున్నారు. ఆయన ఇటీవలే బిజెడిని వదిలి బిజెపిలో చేరారు. ఇదిలావుండగా ఒడిశాలో లోక్‌సభ ఎన్నికలతోపాటు 41 అసెంబ్లీ సీట్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?