83 శాతం మంది కోటీశ్వరులే!

సిట్టింగ్‌ ఎంపీల్లో 430 మంది కోట్లకు పడగలెత్తినవారే
వారిలో 227 మంది బిజెపి ఆసాములే
ఇక 33 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు
పది మందిపై మర్డర్‌ కేసులు, 106 మందిపై సీరియస్‌ కేసులు: ఎడిఆర్‌ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 521 మంది సిట్టింగ్‌ ఎంపీల్లో కనీసం 83 శాతం మంది కోటీశ్వరులు. అలాగే వారిలో 33 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు నమోదై వున్నాయి. స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌ (ఎడిఆర్‌) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎన్నికల సంస్కరణల కోసం పనిచేస్తున్న ఎన్‌జీవోగా ఎడిఆర్‌కు మంచి గుర్తింపు వుంది. 2014 లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీల్లో 521 మంది సభ్యులు దాఖలు చేసిన స్వీ య ప్రకటిత అఫిడవిట్లను నిశితంగా అధ్యయనం చేసిన ఎడిఆర్‌ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ 521 మందిలో 430 మంది అంటే 83 శాతం మంది కోటీశ్వరులని, వారిలో 227 మంది బిజెపి సభ్యులేనని తెలిపింది. అలాగే 37 మంది కాంగ్రెస్‌ ఎంపీలు, 29 మంది ఎఐఎడిఎంకె ఎంపీలు కరోడ్‌పతులుగా వున్నట్లు ఎడిఆర్‌ వెల్లడించింది. 2014 లోక్‌సభ సిట్టింగ్‌ ఎంపీల సగటు ఆస్తి రూ. 14.72 కోట్లు. 32 మంది సిట్టింగ్‌ ఎంపీల ఒక్కొక్కరి ఆస్తి విలువ రూ. 50 కోట్లకు పైనే. కేవలం ఇద్దరు ఎంపీల ఆస్తి మాత్రమే రూ. 5 లక్షలు చొప్పున వుంది. కనీసం 33 శాతం మంది సిట్టింగ్‌ ఎంపీలు తమపై వున్న క్రిమినల్‌ కేసుల వివరాలను అఫిడవిట్లలో పేర్కొన్నారు. వారిలో 106 మందిపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులు నమోదై వున్నాయి. అందులో హత్య, హత్యాయత్నం, మత కల్లోలాలు సృష్టించడం, కిడ్నాపింగ్‌, మహిళలపై అఘాయిత్యాలు వంటి కేసులు వారిపై వున్నాయి. 10 మంది ఎంపీలపై హత్య కేసులు నమోదై వున్నాయి. వారిలో నలుగురు ఎంపీలు బిజెపికి చెందినవారు కాగా, కాంగ్రెస్‌, ఎన్‌సిపి, ఎల్‌జెపి, ఆర్‌జెడి, స్వాభిమాని పక్ష పార్టీల నుంచి ఒక్కొక్కరు, ఒక స్వతంత్ర ఎంపీ వున్నారు. 14 మంది సిట్టింగ్‌ ఎంపీలపై హత్యాయత్నం కేసులు నమోదై వున్నాయి. వారిలో 8 మంది ఎంపీలు బిజెపికి చెందినవారు కాగా, కాంగ్రెస్‌, ఎఐటిసి, ఎన్‌సిపి, ఆర్‌జెడి, శివసేన, స్వాభిమాని పక్షల నుంచి ఒక్కొక్కరు చొప్పున వున్నారు. అలాగే 14 మంది సిట్టింగ్‌ ఎంపీలు మత కల్లోలాలకు కారణమైనట్లు ఆరోపణలున్నాయి. వారిలో బిజెపి ఎంపీలు 10 మంది వుండగా, టిఆర్‌ఎస్‌, పిఎంకె, ఎఐఎంఐఎం, ఎఐయుడిఎఫ్‌ల నుంచి ఒక్కొక్కరు వున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?