మరో చరిత్ర

మెల్‌బోర్న్‌: ఆసీస్‌ గడ్డపై భారత్‌ తొలిసారిగా ద్వైపాక్షిక సిరీస్‌ను గెలుచుకుని కొత్త చరిత్ర సృష్టించింది. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనను కోహ్లీ సేన పరిపూర్ణ విజయాలతో ముగించింది. దాదాపు రెండు నెలల సుధీర్ఘ పర్యటనలో మొదట భారత జట్టు టి20 సిరీస్‌ను 1 డ్రా చేసుకుంది. తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లో 2 చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సైతం 2 గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఈ పర్యటనలో టీమిండియా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంది. అందరూ కలసికట్టుగా రాణించారు. ఇప్పటివరకు ఆసీస్‌ గడ్డపై సాధ్యం కానీ రికార్డులను ఈసారి కోహ్లీ సేన బద్దలు కొట్టింది. టెస్టు సిరీస్‌తో పాటు, వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకుని నయా చరిత్ర సృష్టించింది. ఆసీస్‌ పర్యటనలో భారత జట్టు ఒక్క సిరీస్‌ను కూడా ఓడకపోవడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భారత జట్టు ఎన్నో రికార్డులను నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి, నిర్ణయాత్మకమైన మూడవ వన్డేలో భారత జట్టు 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. యాజువేంద్ర చాహల్‌ (6/42) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 230 పరుగులకే కుప్పకూలింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్‌లో మహేంద్ర సింగ్‌ ధోనీ (87 నాటౌట్‌: 114 బంతుల్లో 6 ఫోర్లు), కేదర్‌ జాదవ్‌ (61 నాటౌట్‌; 57 బంతుల్లో 7 ఫోర్లు) అద్భుతమైన హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే టీమిండియా 234/3 పరుగులు చేసి 7 వికెట్ల ఘన విజయాన్ని అందుకుంది. ఈ సిరీస్‌లో ధోనీ వరుసగా మూడు అర్ధ శతకాలతో తన సత్తా చాటాడు. కీలక సమయాల్లో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచి మ్యాచ్‌లను విజయవంతంగా ముగించాడు. చివరి రెండు వన్డేల్లో ధోనీ నాటౌట్‌గా నిలవడం విశేషం. బ్యాట్‌తో రాణించి భారత్‌కు వన్దే సిరీస్‌ అందించిన మహేంద్ర సింగ్‌ ధోనీకి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు లభించింది. శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత స్పిన్నర్‌ చాహల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కి ముందు వరుస విజయాలతో చెలరేగడం టీమిండియాకు శుభసూచికం. ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి గొప్ప ప్రదర్శనలు భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తు చేసిన కోహ్లే సేన కొత్త అధ్యయాన్ని లిఖించుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ భారత జట్టు మంచి ప్రదర్శన చేసింది. నిలకడమైన ఆటతో అందరూ గొప్పగా రాణించారు. విజయాలతో ఆసీస్‌ పర్యటనను పూర్తి చేసిన కోహ్లీ సేనపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రముఖుల నుంచి సాధారణుల వరకు అందరూ భారత జట్టును అభినందించారు. ఇక జనవరి 23 నుంచి న్యూజిలాండ్‌ పర్యటన ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌ పర్యటనలో భారత జట్టు ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడనుంది.

DO YOU LIKE THIS ARTICLE?