ఉమ్మడి హైకోర్టు అధ్యయనానికి తెర

అమరావతికి బయలుదేరిన ఎపి హైకోర్టు సిబ్బంది
ఉమ్మడి హైకోర్టు అధ్యయనానికి తెర
ఉద్వేగానికి లోనైన ఇరు రాష్ట్రాల న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది
ఆత్మీయ వీడ్కోలు పలికిన తెలంగాణ సిబ్బంది
నేటి నుంచి తెలంగాణ హైకోర్టు కార్యకలాపాలు
గవర్నర్‌ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయనున్న సిజెలు

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు అధ్యాయం సోమవారంతో ముగిసింది. మంగళవారం నుండి తెలంగాణ హైకోర్టు మనుగడలోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఉమ్మడి కోర్టు ప్రాంగణంలోనే తెలంగాణ హైకోర్టు పని ప్రారంభించనుంది. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌ చేత గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ అమరావతికి వెళ్లి ఉదయం 11.30 గంటలకు అక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో ఎపి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌తో ప్రమాణం చేయిస్తారు.
ఎపి న్యాయమూర్తులకు ఆత్మీయ వీడ్కోలు : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అమరావతి నుండి పని ప్రారంభించనున్న నేపథ్యంలో ఎపి న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి తెలంగాణ న్యాయవాదులు, సిబ్బంది సోమవారం నాడు హైకోర్టు ప్రాంగణంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఒకరినొకరు అలిగనం చేసుకుని వారి తీపి గుర్తులను నెమరేసుకున్నారు. నిన్నటి వరకు కలిసి పనిచేసిన తోటి న్యావాదులు, సిబ్బంది తమతో దూరంగా వెళ్లిపోతున్నారనే బాధను వారు దిగమింగుకున్నారు. ఉమ్మడి హైకోర్టు పనిగంటలు ముగిసన తరువాత హైకోర్టు వద్ద తెలంగాణ, ఎపి న్యాయవాదులు, సిబ్బందితో హడావిడి వాతావరణం ఏర్పడింది. ఆంధ్రాప్రాంతానికి వెళ్తున్న న్యాయమూర్తులకు తెలంగాణ లాయర్లు, న్యాయ సిబ్బంధి శుభాంకాంక్షలు తెలిపారు. రెండు హైకోర్టులు విడిపోవడంతో ఒకవైపు హడావిడి మరోవైపు సహచర సిబ్బంది వెళ్లిపోతుండటంతో ఉమ్మడి హైకోర్టు ప్రాంగణంలో సం దడి వాతావరణం ఏర్పడింది. ఇన్నేళ్లు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని స్వీయ చిత్రాలు తీసుకుంటూ ఆత్మీయ వీడ్కోలు పలికారు. నేటి నుంచి అమరావతి నుంచే ఆ రాష్ట్ర హైకోర్టు పనిచేయనుంది. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి అమరావతికి 900 మంది ఉద్యోగులు, ఫైళ్లను ప్రత్యే క బస్సులలో తరలివెళ్లారు. ఇదిలావుండగా అమరావతి పరిధిలో నిర్మిస్తున్న హైకోర్టు భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని ఎపి హైకోర్టు న్యాయవాదుల సంఘం వేసిన రిట్‌ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించినప్పటికీ..అత్యవసర విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ స్పష్టం చేశారు. జనవరి 2న సాధారణ విచారణ చేపడతామన్నారు. ఇదిలాఉండగా ఉమ్మడి హైకోర్టు విభజనను నిరసిస్తూ ఎపి న్యాయవాదులు హైకోర్టు వద్ద నిరసన తెలియజేశారు.హైకోర్టు విభజనపై రాష్ట్రపతి నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా వారు నినాదాలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వుల కాపీలను వారు తగులబెట్టారు.

DO YOU LIKE THIS ARTICLE?