50,000 చేరువలో..

భారత్‌లో కరోనా మహమారి ఉగ్రరూపం
కొత్తగా 2958 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ
49,391కు చేరిన బాధితుల సంఖ్య
1694 మంది మృత్యువాత
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2958 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, మరో 126మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సం ఖ్య బుధవారం ఉదయానికి 49,391కు చేర గా 1694మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 1457 మంది రకవరీ కాగా, మొత్తం బాధితుల్లో 14,183మంది కోలుకున్నారు. మరో 33,514 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 28.72 శాతం గా ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే ఇప్పటి వరకు రోజుకు రెండుసార్లు విడుదల చేస్తున్న బులెటిన్‌ను ఇక నుంచి ఒక్కసారే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
మహారాష్ట్రలో 15వేలు, గుజరాత్‌లో 6వేలు..
మహారాష్ట్రలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 984కొత్త కేసులు, 34మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 15,525కి చేరగా 617మంది మృత్యువాతపడ్డారు. ముంబయి మహానగరంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇక గుజరాత్‌లో ఒకేరోజు అత్యధికంగా 441కేసులు నిర్ధారణ అవడంతోపాటు ఒక్కరోజే 49మంది మరణించారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6245కి చేరగా ఇప్పటివరకు 368మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఒకేరోజు 206 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఢిల్లీలో ఈ వైరస్‌ బారినపడినవారి సంఖ్య 5104కి చేరగా 64మంది మరణించారు. తమిళనాడులో గత రెండు రోజులుగా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కేవలం ఒక్కరోజే రాష్ట్రంలో 508కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4058కి చేరగా 33మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3049 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 176మంది మరణించారు.

DO YOU LIKE THIS ARTICLE?