48 గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాష్ట్రంలో వరుణుడి ప్రభావం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిం ది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురియవచ్చని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల ని అధికారులు హెచ్చరించారు. ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయ ని పేర్కొన్నారు. ఇక అనేక ప్రదేశాల్లో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.
48 గంటల్లో అల్పపీడనం…
సుమారు 18 ఎన్‌ అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉన్న తూర్పు – పశ్చిమ ద్రోణి బలహీన పడింది. బుధవారం ఉపరితల ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతూ.. నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, జగిత్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ గ్రామీణం, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురియనున్నట్లు చెప్పారు.
జంటనగరాల్లో మోస్తరు వర్షాలు…
రాజధాని హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సీయస్‌, కనిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సీయస్‌ నమోదవుతాయన్నారు. హైదరాబాద్‌ నగరంలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఏడాది జులై 20 నాటికి సాధారణ వర్షపాతం కంటే అత్యధిక వర్షపాతం నమోదైంది. మంగళవారం వరకు నగరంలో 70 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్ల తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ వెల్లడించింది. జులై 20వ తేదీ వరకు 359.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఈ తేదీ వరకు సాధారణ వర్షపాతం 210.9 మిల్లిమీటర్లు మాత్రమే. ఐఎండి లెక్కల ప్రకారం జులైలో నెలలో 285.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గత 10 సంవత్సరాల్లో ఇదే అత్యధికమని వెల్లడించింది. ఇక రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

సరస్వతి బ్యారేజీ 23 గేట్లు ఎత్తివేత
ప్రజాపక్షం / కాళేశ్వరం  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజిలో ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి పెరిగింది. 94,600 క్యూసెక్కుల నీటి ప్రవాహం బ్యారేజీలోకి వస్తోంది. దీంతో బుధవారం మధ్యాహ్నం అధికారులు సరస్వతి బ్యారేజీ 23 గేట్లు ఎత్తి 51,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కురిసిన వర్షాలకు ఈ నెల 14 నుండి సరస్వతి బ్యారేజిలోకి క్రమ క్రమంగా చేరుతున్న వరద నీటి ఆధారంగా హెచ్చు,తగ్గు స్థాయిలో బ్యారేజి గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు మంగళవారం సాయంత్రం బ్యారేజి గేట్లను పూర్తిగా మూసివేశారు. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలతో మళ్లీ బుధవారం బ్యారేజీలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో బుధవారం ఉదయం 4 గేట్లు ఎత్తి 3600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో సాయంత్రం మూడు గంటలకు 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీలోకి వరద ఉధృతి కారణంగా బుధవారం రాత్రి వరకు మరిన్ని గేట్లు ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయన్న సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధిత అధికారులు లోతట్టు ప్రాంతాల గ్రామ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?