4 జిల్లాలు ఎడారే!

ఎపి ప్రాజెక్టుతో రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మంపై తీవ్ర ప్రభావం
శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ కావడం ఖాయం
కెసిఆర్‌, జగన్‌ల పరస్పర అగగాహనతోనే ఎత్తిపోతల
మహా జల ఉద్యమం దిశగా ప్రతిపక్షాల అడుగులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును విస్తరించి సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అమలు చేస్తే శ్రీశైలం ప్రాజెక్ట్టు ఖాళీ అవుతుందని, పూర్వపు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కృష్ణానదీ జలాలపై ఉన్న ప్రాజెక్టు పరిరక్షణకు మహా జల ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకుని పోవాలని నిర్ణయించాయి. కృష్ణానదీ నీకు, గోదావరి నాకు అనే తరహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్‌, జగన్‌ పరస్పరం ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోందని, అందుకే సిఎం కెసిఆర్‌ ఇప్పటి వరకు కృష్ణానదీపై ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోలేదని ప్రతి పక్షాలు విమర్శించాయి. ఎపి ప్రభుత్వం జారీ చేసిన 203 జిఒను తక్షణమే ఉపసంహరించుకునేలా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ప్రతిపక్షాలు, రైతు సంఘం నేతలు సమావేశమై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం అందజేయాలని, అలాగే రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, లేదా చీఫ్‌ ఇంజినీర్‌కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించాయి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశంలో ఎపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఒ 203, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, భవిష్యత్‌ కార్యాచరణ తదితర అంశాలపై హైదరాబాద్‌లోని టిజెఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, టిజెఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరామ్‌, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ(ఎం) నాయకులు జూలకంటి రంగారెడ్డి, సారంపల్లి మల్లారెడ్డి, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు కె. అచ్యుత రామారావు, టిడిపి నాయకులు నల్లేల కిషోర్‌, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు కె. సూర్యం, తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు సందీప్‌ చమార్‌, టిజెఎస్‌ నాయకులు ప్రొఫెసర్‌ రమేశ్‌రెడ్డి, రిటైర్డ్‌ ఇంజినీర్‌ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా నదీ జలాలపై ఉన్న ప్రాజెక్టులను చేపట్టడంలో సిఎం కెసిఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. కేవలం గోదావరి నదీ జలాలపైనే దృష్టి పెట్టారని, దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించారని, అందుకే ఇక్కడ జలదోపిడీ జరుగుతున్నప్పటికీ మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. జూరాల ప్రాజెక్టుపై మరోక ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్నారు. కృష్ణా నదీ జలాలపై ఉన్న ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, నదీ జాలాల కోసం మరోసారి పోరుబాటకు సిద్ధం కావాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి.

DO YOU LIKE THIS ARTICLE?