25లోగా రాహుల్‌కు ఆశావహుల జాబితా

డిసిసి అధ్యక్షుల అభిప్రాయాలే కీలకం
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తుల తుది గడువు రేపే
ప్రజాపక్షం/ హైదరాబాద్‌ : లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక విషయంలో డిసిసి అధ్యక్షులు, ఇటీవల పోటీచేసిన నియోజకవర్గ అభ్యర్థుల అభిప్రాయాలు కీలకమని పిసిసి అధ్యక్షులు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన జర్నలిస్టులతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలతో ఎంపి అభ్యర్థిత్వానికి దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందన్నారు. ఈ నెల 25వరకు అభ్యర్థుల జాబితాను ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీకి పంపిస్తామని, ఈ నెలాఖరులోపు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని తెలిపారు. లోక్‌సభ అభ్యర్థులను రాహుల్‌గాంధీనే ఎంపిక చేస్తారన్నారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కు వ్యత్యాసం ఉంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రాహుల్‌, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. శాసనమండలి, పట్టభద్రుల ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నామని చెప్పారు. అంతకుముందు ఉత్తమ్‌ డిసిసి అధ్యక్షులతో ఇష్ఠాగోష్ఠిగా మాట్లాడుతూ ఎంపి అభ్యర్థుల ఎంపికలో క్షేత్రస్థాయి అభిప్రాయం తీసుకుంటారని, కొత్త డిసిసి అధ్యక్షులు ఈనెల 15వ తేదీ ఉదయం వరకు తమ పరిధిలోని నియోకవర్గాలకు ఎంపి అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించాలని సూచించారు. ఈ నెలాఖరులో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉన్నదని, మార్చిలో నోటిఫికేషన్‌, ఏప్రిల్‌లో పోలింగ్‌ ఉండే అవకాశం ఉన్నదని వివరించారు. తమ వద్ద ఎక్కువ సమయం లేదని, దేశానికి, రాష్ట్రానికి ఈ ఎన్నికలు కీలకమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో స్థానిక అంశాలకు సంబంధం ఉండదని, ఇది రాహుల్‌గాంధీ, నరేంద్రమోడీ మధ్య జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. రాబోయే 65- రోజుల పాటు అందరూ కష్టపడి రాహుల్‌ను ప్రధాని చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలంతా కష్టపడాలని సూచించారు. ప్రధాని మోడీ దేశాన్ని మతం పేరుతో విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రస్తుతం మైనార్టీలు అభద్రతకు గురవుతున్నట్లు గతంలో ఎప్పుడూ లేదన్నారు. ప్రతి ఒక్కరి బాంక్‌ ఖాతాలో రూ 15 లక్షలు వేస్తామని మోడీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలను నియమిస్తామని హామీనిచ్చి, 2 లక్షలు కూడా నియమించలేదన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని కాగానే యువతకు పెద్ద పీట వేస్తామని, ఉద్యోగాలను నియమిస్తామన్నారు. 2022 సంవత్సరం వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన బిజెపి, ప్రస్తుతం రైతులు మరింత అప్పుల్లో కురుకపోయి, ఆత్మహత్యలు పెరిగినా పట్టించుకునే పరిస్థితిలో లేదని చెప్పారు. రాహుల్‌ ప్రధాని అయిన తర్వాత అన్ని పంటలకు మంచి గిట్టుబాటు ధరను కల్పిస్తామన్నారు. రాహుల్‌ను ప్రధాని చేసేందుకు రాష్ట్రం నుంచి సాధ్యమైనంత ఎక్కువ సీట్లను గెలిపించాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?