24 గంటల్లో 19,459 కేసులు

భారత్‌లో తాజాగా మరో 380 మంది మృతి
5,48,318కి చేరిన బాధితులు, 16,475కి పెరిగిన మృతులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు అతి వేగంగా పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి కొత్తగా 20 వేలకు చేరువులో కేసులు రావడం మరింత గుబు లు పుట్టిస్తుంది. సోమవారం ఉదయం నాటి కి గడిచిన 24 గంట ల్లో 19,459 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. తాజాగా మరో 380 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 16,475కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే వరుసుగా ఆరువ రోజూ 15 వేలకుపైగా కేసులు నమోదు కావడం తీవ్ర కలవరం సృష్టిస్తుంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు 3,57,783 మంది మహమ్మారి బారిన పడ్డారు. దేశంలో మొత్తం 2,10,120 యాక్టివ్‌ కేసులు ఉండగా, 3,21,722 మంది కరోనా నుం చి కోలుకున్నారు. సోమవారం ఉదయం నాటికి యాక్టివ్‌ కేసులు, రికవరీ కేసుల మధ్య వ్యత్యాసం 1,11,602గా ఉంది. దీంతో రికవరీ రేటు 58.67గా ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. ఆదివారం నుంచి మొత్తం 12,010 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రపంచంలో అత్యంత వైరస్‌ ప్రభావితమైన దేశంగా అమెరికా, బ్రెజిల్‌, రష్యాల తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక 1047 డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లను పూర్తిగా కొవిడ్‌ గుర్తించేందుకు కేటాయించారు. అందులో 760 ల్యాబ్‌లు ప్రభుత్వరంగానికి చెందినవి కాగా, 287 ల్యాబ్‌లు ప్రైవేటుకు చెందినవి. ఈనెల 28 నాటికి మొత్తం 83,98,362 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) పేర్కొంది. కేవలం ఆదివారం ఒక్క రోజే 1,70,560 శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉండగా, ఇక కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఐదు వేలకుపైగా కొవిడ్‌- కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 156 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 1,64,626 కేసులు నమోదు కాగా, 7,429 మంది మరణించారు. దేశంలోనే మహారాష్ట్ర అటు కేసులు, ఇటు మరణాల్లో ప్రథమ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ 24 గం టల్లో దాదాపు 3 వేల మంది కరోనా బారిన పడ్డారు. కొత్తగా 65 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 83,077 ఉండగా, మొత్తం 2,623 మంది బలయ్యారు. దేశంలోనే ఢిల్లీ బాధితులు, మరణాలు రెండింటిలోనూ రెండవ స్థానంలో ఉంది. ఇక తమిళనాడులో కొత్తగా 54 మంది మృతి చెందారు. ఈ రాష్ట్రంలో గత మూడు రోజుల నుంచి నిత్యం దాదాపు 4 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. మొత్తం కేసుసల సంఖ్య 82,275 నమోదు కాగా, 1,079 మంది చనిపోయారు. గుజరాత్‌లో మొత్తం 31,320 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, కొత్తగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,808కు చేరింది. ఉత్తరప్రదేశ్‌లో 24 గంట ల్లో 11 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 660కి చేరుకోగా, మొత్తం 22,147 కేసులు నమోదయ్యాయి. ఇక పశ్చిమ బెంగాల్‌ మొత్తం 639, మధ్యప్రదేశ్‌లో 557, రాజస్థాన్‌లో 399, తెలంగాణలో 247, ఆంధ్రప్రదేశ్‌లో 169 మంది మరణించారు. కేసుల విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్‌లో 17,283, రాజస్థాన్‌లో 17,271, తెలంగాణలో 14,419, ఆంధ్రప్రదేశ్‌లో 13,891 కేసులు నమోదయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?