24 గంటల్లో 11,929 కేసులు

దేశంలో కొత్తగా 311 మంది మృతి
3,20,922కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 11,929 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా వైరస్‌ బారినపడిన వారిసంఖ్య 3,20,922కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. అలాగే కరోనా వైరస్‌ సోకి మరణిస్తున్న వారిసంఖ్య భారీగా పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా దేశంలో నిత్యం 300లకుపైగా కొవిడ్‌- మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 311 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మరణించినవారి సంఖ్య 9195కు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,62,379 మంది కోలుకోగా మరో 1,49,348 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో శనివారం నాటికి కరోనా కేసులు 36,824కి చేరుకున్నాయి. మృతుల సంఖ్య 1,214గా నమోదైంది. దక్షిణ భారత్‌లోని చెన్నైలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70 శాతం చెన్నై నుంచే వస్తున్నాయి. శనివారం నాటికి చెన్నైలో 27 వేల కేసులు ఉంటే, తమిళనాడులో కేసుల సంఖ్య 40,698కి చేరుకుంది. మహారాష్ట్రలోని థానేలో ఏకంగా 16 వేల కేసులు నమోదైతే 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటివరకు 16 వేలకు పైగా కేసులు అహ్మదాబాద్‌లోనే నమోదయ్యా యి. ఇదిలాఉంటే, కరోనా మరణాల్లో భారత్‌ ప్రపంచంలోనే తొమ్మి దో స్థానంలో కొనసాగుతోంది. 9650 మరణాలతో బెల్జియం 8వ స్థానం, 8867 మరణాలతో జర్మనీ 10స్థానంలో కొనసాగుతోంది. ఇక కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉండగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
10 రోజుల్లోనే లక్ష కేసులు
భారత్‌లో 100 కేసుల నుంచి మొదటి లక్ష కేసులు నమోదు కావడానికి 64 రోజులు పట్టింది. ఆ తర్వాత మరో 15 రోజుల్లో కేసులు రెండు లక్షలు దాటాయి. అప్పట్నుంచి కేవలం 10 రోజుల్లోనే భారత్‌లో కేసుల సంఖ్య 3 లక్షలు దాటడం కరోనా వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం కాస్త ఎక్కువ కావడం కొంతలో కొంత ఊరటనిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటివరకు 15.4 రోజుల్లో కేసులు రెట్టింపైతే ఇప్పుడది 17.4 రోజులకు చేరుకుంది. 15 నగరాల్లో తీవ్రత కరోనా లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చిన అనంతరం పలు నగరాల్లో వైరస్‌ తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా 15నగరాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు భారీగా నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, వడోదర, షోలాపూర్‌, గువాహటితో పాటు మొత్తం 15 ప్రధాన నగరాల్లో వైరస్‌ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. అంతేకాకుండా, దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 63శాతం కేసులు ఈ నగరాల్లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ కేవలం గత 10రోజుల్లోనే పెరగడం గమనార్హం. ఇప్పటికే మహారాష్ట్రలో నమోదవుతున్న కేసులలో దాదాపు 54శాతం ఒక్క ముంబయి నగరంలోనే నమోదవుతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు 70శాతం ఒక్క చెన్నై నగరంలోనే బయటపడుతున్నాయి. ఇక కరోనా మరణాలు రేటు అధికంగా ఉన్న గుజరాత్‌లోనూ ఇదే పరిస్థితి. ఈ రాష్ట్రంలో నమోదౌతున్న మొత్తం కేసుల్లో దాదాపు 71శాతం ఒక్క అహ్మదాబాద్‌ నగరంలోనే ఉంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌, ఆగ్రా, లక్నో, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, నాగౌర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గడ్‌, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ఇండోర్‌, ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాగపూర్‌లలో గడచిన పదిరోజుల్లోనే కరోనా వైరస్‌ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ నగరాల్లో నిత్యం కొత్తగా 50మందికిపైగా ఈ వైరస్‌ బారినడతున్నారు. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా వైద్య పరీక్షలు నిర్వహించే పనిలోపడ్డాయి. గురుగ్రామ్‌లో కొత్తగా 31 కంటైన్మెంట్‌ జోన్లను హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న భోపాల్‌లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇండోర్‌లో భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. నాగపూర్‌లోనూ కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. గడచిన రెండు రోజుల్లో 100పాజిటివ్‌ కేసులు బయటపడడంతో చాలా ప్రాంతాలను హాట్‌స్పాట్‌ జోన్లుగా గుర్తించింది.

DO YOU LIKE THIS ARTICLE?