24 గంటలూ పోలీసుల కాపలా

రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో కఠిన నిబంధనలు
అనుమానితులకు పరీక్షలు
రాకపోకలు లేకుండా కఠిన ఆంక్షలు
ఇళ్ల వద్దకే నిత్యావసర సరకులు సరఫరా
సిసిటివి కెమెరాలతో అధికారుల పర్యవేక్షణ

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కరోనా పాజిటివ్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌ జోన్‌లుగా అధికారులు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ రెడ్‌జోన్‌ ప్రాంతాలలో కఠిన నిబంధనలు అమలుచేస్తున్నారు. రాకపోకలపై ఆంక్షలు విధించారు. నిత్యావసర వస్తువులను ఇళ్ల వద్దకే ప్రభుత్వ సిబ్బంది సరఫరా చేస్తున్నారు. ఎవ్వరు బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులు 24 గంటల పాటు పహారా కాస్తున్నారు. ఈ రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు, క్రిమి సంహకరక మందైన సోడియం హైపో క్లోరైడ్‌ను ఎప్పటికప్పుడు పిచికారీ చేయిస్తున్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలలో పరిస్థితిని వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సిసిటివి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచే శారు. ఈ కంట్రోల్‌రూమ్‌ ద్వారా అన్నపూర్ణ కేం ద్రాలకు సకాలంలో భోజనం పంపించడం, మొబైల్‌ వాహనాల ద్వారా నైట్‌ షెల్టర్లు, వలస కూలిలు ఉన్న ప్రాంతాలకు భోజనాన్ని పంపిస్తున్నారు. ఇలాంటి అత్యవసర పనులను కంట్రోల్‌రూం ద్వారా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా, ఏ ప్రాంతంలో అయితే ఇతరులకు కరోనా వైరస్‌ సోకిందో, ఆయా ప్రాంతాలను రెడ్‌ జోన్‌లుగా గుర్తించారు. ఇక అక్కడి నుంచి ప్రజలను బయటకు వచ్చేందుకు వీలు లేకుండా భారీ స్థాయిలో భారికేడింగ్‌లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలను రెడ్‌ జోన్‌గా చేశామని సూచిస్తూ ప్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ 24 గంటల పాటు పోలీసులు కాపలా ఉంటున్నారు. ప్రత్యేకంగా నియమించిన అధికారులు, హెల్త్‌ వర్కర్లు, నిత్యావసరాలు సరఫరా చేసే వారికి మాత్మే బారీకేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఇక కరోనా పాజిటివ్‌ నమోదైన ఇంటికి, ఆ ఇంట్లో కరోనా మహమ్మారి ఉందని సూచిస్తూ ప్రత్యేక స్టిక్కర్లను అంటించారు. ఇక నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయాలు ఇతర వస్తువులను అధికారులే ఇళ్ల వద్దకు చేరుస్తున్నారు. వాటిని కూడా ఇంట్లో నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. తమ పక్క వీధిలో ఉంటున్న వారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కావాల్సిన వస్తువులు తెచ్చుకుంటున్నా రెడ్‌ జోన్‌ పరిధిలోని వారు ఎంతో అత్యవసరమైతే, అది కూడా పోలీసుల అనుమతితో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. రెడ్‌ జోన్‌లలోకి బయటి వ్యక్తులను అనుమతించడం లేదు. రెడ్‌ జోన్‌ ప్రాంతానికి రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధి వరకూ ప్రత్యేకంగా  పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని ప్రత్యేక వాహనాలతో పిచికారి చేయిస్తున్నారు.
రెడ్‌ జోన్‌ ప్రాంతాలలో ఎవరికైనా జలుబు, దగ్గు తదితర కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వాని నమూనాలను సేకరించి, క్వారంటైన్‌ చేస్తారు. రెడ్‌ జోన్‌ల పరిధిలో కనీసం 14 రోజుల పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈలోగా కొత్త కొత్త కేసులు రాకుండా ఉంటేనే నిబంధనలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొత్త కేసులు వస్తే, ఆపై మరో 14 రోజుల పాటు మరోసారి ఆంక్షలు అమలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?