కరోనా సంక్షోభంతో పేదరికంలోకి మరో 4.9 కోట్ల మంది
ఐక్యరాజ్యసమితి ఆందోళన
న్యూయార్క్‌: కరోనా సంక్షోభంతో ఈ ఏడాది అదనంగా మరో 4.9 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఆహార భద్రతపై పెనుప్రభావం చూపుతుందని హెచ్చరించింది. అంతర్జాతీయ ఆహార భద్రత కోసం అన్ని దేశాలు సత్వరమే పూనుకోవాలని ఐక్యరాజ్యసమితి చీఫ్‌ ఆంటోనియా గుటెరస్‌ పిలుపునిచ్చారు. సభ్య దేశాలు తక్షణమే చర్యలు చేపట్టని పక్షంలో అంతర్జాతీయ ఆహార అత్యవసర పరిస్థితి ఏర్పడి కోట్లాది పిల్లలు, వయోజనులపై దీర్ఘకాలం ప్రభా వం చూపుతుందని హెచ్చరించారు. ప్రపంచ జనాభా 780 కోట్ల మందికిపైగా ప్రజల ఆకలి తీర్చేందుకు సరిపడా తగినంత ఆహారం ప్రపంచం వద్ద ఉందని, అయినా ఇప్పుడు 82 కోట్ల మందికి పైగా ఆకలితో అలమటిస్తున్నారని గుటెరస్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది చిన్నారులకు ఆహారం అందుబాటులో లేదని, ఐదుగురు పిల్లల్లో ఒకరు క్షుద్భాద అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మన ఆహార వ్యవస్థలు విఫలం కాగా, కొవిడ్‌- మహమ్మారి పరిస్థితులను మరింత దిగజార్చిందని ఆహార భద్రతపై ఐక్యరాజ్యసమితి విధానంపై గుటెరస్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పలు దేశాల్లో తగినన్ని ఆహార నిల్వలున్నా ఆహార సరఫరా వ్యవస్ధల్లో అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. వైరస్‌ మహమ్మారి నిరోధానికి ప్రపంచ దేశాలు కార్యాచరణకు పూనుకోవాలన్నారు. ఆహార భద్రత కొరవడిన దేశాలకు ఆహారం అందుబాటులోకి తీసుకువచ్చేలా దేశాలు చొరవచూపాలని కోరారు. చిన్నారులకు పోషకాహారం అందుబాటులో ఉంచాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?