దాడికి నిరసనగా జూనియర్‌ డాక్టర్లు విధుల బహిష్కరణ
మంత్రి ఈటలతో చర్చలు సఫలం.. నిరసన విరమణ
సమస్యలపై కమిటీ ఏర్పాటుకు మంత్రి అంగీకారం
జూడాలపై దాడిని ఖండించిన రాజకీయ పార్టీలు
మద్దతు తెలిపేందుకు వెళ్లిన నేతల అరెస్ట్‌
ప్రజాపక్షం/హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో జూనియర్‌ వైద్యులు (జూడాలు) బుధవారం ఉదయం ధర్నా చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మృతి చెందాడని గాంధీ ఆసుపత్రిలోని జూనియర్‌ డాక్టర్‌పై మంగళవారం రాత్రి మృతుడి బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి నుంచి సుమారు 300 మంది జూనియర్‌ డాక్టర్లు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు. బుధవారం కూడా నిరసనను కొనసాగించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్వయంగా గాంధీ ఆసుపత్రికి వచ్చి జూనియర్‌ డాక్టర్లతో చర్చలు జరిపారు. తమకు తగిన రక్షణ కల్పించాలని, తాము సిఎం కెసిఆర్‌నే కలిసి తమ సమస్యలు చెబుతామని జూనియర్‌ డాక్టర్లు పట్టుబట్టారు. ఇందుకు మంత్రి ఈటల రాజేందర్‌ స్పందిస్తూ గాంధీ ఆసుపత్రితో సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైత్యులకు, సిబ్బందికి తగిన రక్షణను, సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు జూనియర్‌ డాక్టర్లు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నానని మంత్రి తెలిపారు. సమస్యలను ఎప్పటికికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా జూనియర్‌ డాక్టర్లు కోరినట్లు కమిటీని ఏర్పాటు చేసేందుకు కూడా మంత్రి అంగీకరించారు. కరోనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిరససను విరమించి విధుల్లో చేరాలని మంత్రి కోరారు. మంత్రి హామీ మేరకు జూనియర్‌ డాక్టర్లు తమ నిరసనను విరమించి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. అంతకు ముందు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు జూనియర్‌ డాక్టర్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కొవిడ్‌ పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో జూనియర్‌ డాక్టర్లకు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) మద్దతు ప్రకటించింది. ఇదిలా ఉండగా జూనియర్‌ డాక్టర్‌పై దాడి ఘటనలో ఇద్దరు నిందితులను చిలకగూడ పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.
రాజకీయ నేతలను అడ్డుకున్న పోలీసులు
జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న ధర్నాకు మద్దతు ప్రకటించేందుకు బుధవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రికి వెళ్ళిన వివిధ రాజకీయ పార్టీల నేతలను మార్గమధ్యలోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎంపి కొండా విశ్వేశ్వరరెడ్డి, బొల్లు కిషన్‌ తదితర నేతలు గాంధీ ఆసుపత్రికి వెళుతుండగా బేగపేట వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు బిజెపి ఎంఎల్‌సి ఎన్‌.రామ్‌చందర్‌రావును బిజెపి కార్యాలయం వద్దనే పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సాయంత్రం ఆయనను విడుదల చేశారు.
ఇదిలా ఉండగా జూనియర్‌ డాక్టర్లపై దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌, మాజీ అధ్యక్షులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా గాంధీ ఆసుపత్రిలోని జూనియర్‌ డాక్టర్‌తో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, వారికి తగిన రక్షణ కల్పించాలని వారు కోరారు. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించలేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వదిలేస్తే ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం సిద్దంగా ఉందని వారు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?