199 కొత్త కేసులు

రాష్ట్రంలో కలవరం రేపుతున్న కరోనా వైరస్‌
యాదాద్రి జిల్లాలో తొలి కేసు నమోదు
తాజాగా ఐదుగురు మరణం
ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ తన అసలు సిసలు విశ్వరూపాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తోంది. తాజాగా రాష్ట్రంలో ఒకేరోజు 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 196 కేసులు స్థానికంగా నమోదైనవే. మిగిలిన మూడు కేసులు ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చిన వలస కార్మికులకు సంబంధించినవి. ఇక స్థానికంగా నమోదైన 196 కేసుల్లో అనూహ్యమైన రీతిలో 122 కేసులు ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి) పరిధిలోనే నమోదయ్యాయి. ఈస్థాయిలో జిహెచ్‌ఎంసిలో కేసులు నమోదు కావడం కూడా ఇదే మొదటిసారి. అలాగే జిహెచ్‌ఎంసికి అనుబంధంగా వున్న రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 40 కేసులు, మేడ్చల్‌లో 10 కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా, ఖమ్మంలో 9 కేసులు నమోదయ్యాయి. ఇక మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్‌ జిల్లాల్లో మూడేసి కేసులు, వరంగల్‌ అర్బన్‌లో రెండు, సూర్యాపేట, నిర్మల్‌, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇప్పటివరకు గ్రీన్‌ జిల్లాగా అందరి మన్ననలు పొందిన యాదాద్రి భువనగిరిలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చివరకు ఒక్క వరంగల్‌ రూరల్‌ జిల్లా మాత్రమే కరోనా రహిత జిల్లాగా మిగిలింది. మిగిలిన అన్ని జిల్లాలనూ కరోనా తాకినట్లయింది. ఆదివారం నమోదైన 199 కేసులతో కలుపుకొని, ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,698కి చేరింది. వీటిలో స్థానిక కేసులు 2264 కాగా, వలసలు, ప్రవాసులకు సంబంధించిన కేసులు 434గా ఉన్నాయి. ఇప్పటివరకు 1428 మందిని డిశ్చార్జి చేయగా, ఇంకా 1188 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆదివారంనాడు మరో ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య 82కి పెరిగింది.

DO YOU LIKE THIS ARTICLE?