16న 13,900 మందికి టీకా

ప్రజాపక్షం/హైదరాబాద్‌ కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ నెల16న రాష్ట్ర వ్యాప్తంగా 139 సెంటర్లలో తొలి రోజు 13,900 మందికి టీకా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కేంద్ర క్యాబినెట్‌ సెక్రెటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వాక్సినేషన్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చిం చారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలు పెడతామని ప్రధానమంత్రి మోడీ ప్రకటించారు. ఇందుకు తెలంగాణ రాష్ట్రం సన్నద్ధంగానే ఉన్నదని రాష్ట్ర అధికారులు తెలియజేశారు. ఈ సమావేశ వివరాలను రాష్ట్ర ఉన్నతాధికారులు మంత్రి ఈటల రాజేందర్‌కు ఆదివారం వివరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డ్రై రన్‌లను విజయవంతంగా నిర్వహించామని,ప్రతి జిల్లాలో రెండు నుంచి మూడు కేంద్రాలు ఉన్నట్టు తెలియజేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న హెల్త్‌ కేర్‌ వర్కర్లు 2,90,000 వ్యాక్సిన్‌ కోసం పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. కాగా 16వ తేదీన రాష్ట్రంలోని రెండు వ్యాక్సిన్‌ కేంద్రాలతో ప్రధానమంత్రి ఇంటరాక్ట్‌ అవ్వనున్నారు.అలాగే తొలి వ్యాక్సిన్‌ను తానే వేసుకుంటానని మంత్రి ఈటల రాజేందర్‌ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

DO YOU LIKE THIS ARTICLE?