15 బంతుల్లో 6 వికెట్లు..

ట్రెంట్‌ బౌల్ట్‌ సంచలనం
శ్రీలంక 104 ఆలౌట్‌
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు
క్రిస్ట్‌చర్చ్‌: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ సంచలనం సృష్టించాడు. నిప్పులు చెరిగే బంతులతో లంక బ్యాట్స్‌మెన్స్‌పై విరుచుకపడి 15 బంతుల్లోనే 6 వికెట్లు పడగొట్టి కొత్త రికార్డు నమోదు చేశాడు. గురువారం 88/4 పరుగులు ఓవర్‌నైట్‌ స్కోరుతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 104 పరుగులకే కుప్పకూల్చాడు. ఇతని ధాటికి చివరి ఐదు బ్యాట్స్‌మన్లలో నాలుగురు ఖాతాలు తెరువకుండానే ఎల్బీడబ్ల్యూగాఔటయ్యారు. మరోవైపు ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ రొషన్‌ సిలా (21), నిరోశన్‌ డిక్వెల్లా (4) పరుగులు చేసి వెనుదిరిగారు. మొదటి రోజు 10 ఓవర్లు వేసిన బౌల్ట్‌కు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. కానీ రెండో రోజు ఆటలో మాత్రం ఇతనికి అదృష్టం కలిసొచ్చింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్‌కు చుక్కలు చూపెడుతూ విజృంభించి బౌలింగ్‌ చేశాడు. బౌల్ట్‌ (6/30) ధాటికి శ్రీలంక 41 ఓవర్లలో 104 పరుగులకు ఆలౌటైంది. మర బౌలర్‌ టిమ్‌ సౌథీ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో కివీస్‌కు 74 పరుగులు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అంతకుముందు కివీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 178 పరుగులు చేసింది. గురువారం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌కు ఓపెనర్లు జీత్‌ రావల్‌, టామ్‌ లాథమ్‌ అద్భుతమైన అరంభాన్ని అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమైన వీరిద్దరూ రెండో ఇనింగ్స్‌లో మాత్రం తేరుకున్నారు. లంక బౌలర్లపై విరుచుకపడి పరుగుల దాహం తీర్చుకున్నారు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే వీరు 144 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. అనంతరం కూడా అదే జోరును కొనసాగిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే కుదరుగా ఆడుతున్న జీత్‌ 122 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. తర్వాత కొద్ది సేపటికే న్యూజిలాండ్‌ స్కోరు 37.4 ఓవర్లలో 100 పరుగుల మార్కును దాటింది. వీరిద్దరూ కుదురుగా ఆడుతూ లంక బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. చివరికి దిల్‌రువా పెరీరా ఈ ప్రమాదకరపు జంటను విడదీశాడు. కాగా, కివీస్‌ స్కోరు 121 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కివీస్‌ కెప్టెన్‌ కెన్‌ విలియమ్సన్‌తో కలిసి లాథమ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు మరో కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే సమన్వయంతో ఆడుతున్న లాథమ్‌ 155 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధ శతకం నమోదు చేశాడు. మరోవైపు విలియమ్సన్‌తో కలిసి రెండో వికెట్‌కు 88 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు. లాథమ్‌ కుదురుగా ఆడుతుంటే విలియమ్సన్‌ మాత్రం చెలరేగి ఆడాడు. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ పరుగుల వేగాన్ని తగ్గకుండా చూసుకున్నాడు. ఈ క్రమంలోనే కివీస్‌ 150 పరుగుల కీలకమైన మార్కును దాటి పటిష్ట స్థితికి చేరింది. తర్వాత కొద్ది సేపటికి దూకుడుగా ఆడుతున్న కెప్టెన్‌ విలియమ్సన్‌ (48; 75 బంతులో 5 ఫోర్లు)ను లాహిరు కుమార పెవిలియన్‌ పంపాడు. దీంతో కివీస్‌ 189 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన రాస్‌ టేలర్‌ కలిసి లాథమ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఒకవైపు లాథమ్‌ కుదురుగా ఆడుతుంటే.. మరోవైపు రాస్‌ టేలర్‌ మాత్రం చెలరేగి ఆడాడు. లంక బౌలర్లపై విరుచుకపడి వేగంగా పరుగులు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ జట్టు (79 ఓవర్లలో) 2 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న లాథమ్‌ (74 బ్యాటింగ్‌; 213 బంతుల్లో 8 ఫోర్లు), రాస్‌ టేలర్‌ (25 బ్యాటింగ్‌; 27 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజులో నిలబడిఉన్నారు. లంక బౌలర్లలో లాహిరు కుమార, దిల్‌రువా తలొక్క వికెట్‌ తీశారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 305 పరుగుల ఆధిక్యం సాధించింది. మూడో రోజు మరిన్ని పరుగులు చేసి లంకాకు భారీ టార్గెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?