12 హైవే కిల్లర్‌ మున్నా కేసులో మందికి ఉరి

శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు సంచలన తీర్పు
ఒంగోలు:
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఉన్న కోల్‌కతా- చెన్నై 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై 2008లో కొన్ని లారీలు, సిబ్బంది, వాటిలో ఉన్న సరకు అదృశ్యం అయిన కేసుల్లో మున్నా సహా 12 మందికి జిల్లా 8వ అదనపు సెషన్‌కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. మరో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసుల్లో మున్నా హస్తం ఉన్నట్లు ఇటీవల నిర్ధరించిన కోర్టు 3 కేసుల్లో ఉరిశిక్ష ఖరారు చేసింది. 13 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారిపై లారీలు, సరకు సిబ్బంది అదృశ్యం అయిన కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కారణాలు అంతు చిక్కలేదు. ఒక కేసుకు సంబంధించి అప్పట్లో డిఎస్‌పిగా శిక్షణ పొందుతున్న దామోదర్‌కు చిన్న ఆధారం లభించింది. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్మయానికి గురి చేసిన విషయాలు తెలిశాయి. ఒంగోలుకు చెందిన అబ్దుల్‌ సమ్మద్‌ అలియాస్‌ మున్నా ఒక గ్యాంగ్‌ను తయారు చేసుకొని ఈ హత్యలు చేసినట్లు తెలిసింది. గతంలో గుప్త నిధుల పేరుతో ధనవంతుల్ని నమ్మించి, వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, హతమార్చిన కేసుల్లో అబ్దుల్‌ సమ్మద్‌ నిందితుడు. 2008లో జాతీయ రహదారిపై అధికారిలా కాపుకాసి, లోడ్‌తో వస్తున్న లారీలను ఆపడం, రికార్డులు చూపించాలని కోరడం, అదును చూసి మెడలో తాడువేసి, బిగించి హతమార్చేవాడు. మృతదేహాలను గోతాల్లో కుక్కి తోటల్లో అటవీ ప్రాంతాల్లో పాతిపెట్టి, లారీని సరకును మాయ చేసేవాడు. మద్దెపాడులో ఓ పాడుబడ్డ గొడౌన్‌ను అద్దెకు తీసుకొని అక్కడ లారీని తుక్కుగా మార్చి సరకులు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. అలా ఆ జాతీయ రహదారిలో 13 మందిని హత్య చేసినట్లు విచారణలో తేలింది. మున్నాను, ఆయన అనుచరుల్ని అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. మున్నాను కాపాడేందుకు కొంతమంది రాజకీయ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ నేత వ్యవహారం పత్రికల్లో రావడంతోపాటు బలమైన ఆధారాలు లభించడంతో కేసు విచారణ కొనసాగించారు. మున్నాకు బెయిల్‌ రావడంతో బెంగళూరుకు వెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నాడు. అయితే కర్నూలు పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మున్నా, అతని గ్యాంగ్‌ మీద ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుపై ప్రకాశం జిల్లా 8వ అదనపు సెషన్స్‌ కోర్టులో వాదోపవాదనలు జరిగాయి. మొత్తం 7 కేసులకు గానూ 3 కేసుల్లో తీర్పు వెలువరించింది. నేరాలు రుజువవ్వడంతో మున్నా సహా 19 మందికి శిక్ష ఖరారు చేసింది. 12 మందికి ఉరిశిక్ష, ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?